*అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..
కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:
నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45 వ వార్డు లోని శివజ్యోతినగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలని, అంధుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్, వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులోని ఓరియన్ హోటల్ నుండి మురుగునీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి,డి.ఈ. రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.