టేకుమట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడం ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలిపారు.
ఈ సందర్భంగా “వన మహోత్సవం” కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం స్టేషన్ ప్రాంగణ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. అలాగే స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు టేకుమట్ల ఎస్సై లాస్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
