మందమర్రిలో జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు
మందమర్రి నేటి ధాత్రి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకున్న మందమర్రి యువత
నవీన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు
దివ్యాంగ విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. పదవిలో లేకున్నా దాదాపు పదేళ్లుగా వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక–విద్యా సహాయం అందిస్తూ ప్రజలతో మమేకమై సేవలు చేయడం యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆయన సేవా భావాన్ని ముందుంచుకున్న మందమర్రి యువత ఆయన పుట్టినరోజును అర్థవంతంగా సేవామయ కార్యక్రమాలుగా నిర్వహించింది. సోమవారం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లోని మనోవికాస్ పాఠశాలలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, దివ్యాంగ విద్యార్థులకు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. విద్యార్థుల ముఖాల్లో మెరిసిన ఆనందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “నవీన్ యాదవ్ ప్రజలతో కలిసిపోతూ చేసే సేవలు మాకు దిశానిర్దేశం. అలాంటి నాయకుడి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరపడం మా అదృష్టం. ఇకపై కూడా మా ప్రాంతంలో ఇలాంటి సేవలను కొనసాగిస్తాం” అని గుంట శ్రీశైలం తెలిపారు. వరుస పరాజయాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే పనిచేస్తూ, చివరికి విశ్వసనీయతతో భారీ మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్ నిజమైన కష్టపడి ఎదిగిన నాయకుడని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి తోడ్పడిన మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్రను గుర్తుచేసి ఆయన్ను కృతజ్ఞతలతో స్మరించారు. నవీన్ యాదవ్ ఆయురారోగ్యాలతో ముందుకు సాగి తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని యువత ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో మంద తిరుమల్ రెడ్డి, ఆకారం రమేష్, అంకం రాజ్‌కుమార్, కత్తి రమేష్, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
