డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి నేటిధాత్రి
కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్ల కోసం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ఈ శిబిరాన్ని హన్మకొండకు చెందిన శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. డ్రైవర్లు తమ కంటి చూపును నిరంతరం పరీక్షించించుకుని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు.
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్టేకింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు.
కంటిచూపు సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని, రోడ్డుపై సూచనలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి డ్రైవర్ తన భద్రతతో పాటు తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఎస్పీ కళ్లద్దాలు అందజేశారు. సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డిఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
