నర్సంపేట నుండి మేడారం ప్రత్యేక బస్సులు
నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి:
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఈనెల 25 నుండి ఫిబ్రవరి 31 వరకు నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు నడపడనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.ఇందుకు గాను సుమారు ముప్పైరెండు వేల పైగా ప్రయాణికులు నర్సంపేట నుండి మేడారం జాతరకు ప్రయాణిస్తారని అంచనా వేసామన్నారు.కాగా 145 బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పరిస్థితి బట్టి మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నుండి మేడారంకు పెద్దలకు రూ.270/- పిల్లలకు రూ.170/- గా టికెట్ ధర, కొత్తగూడ నుండి పెద్దలకు 330/-, పిల్లలకు 200/-నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యం సరియైన ధ్రువీకరణ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ప్రయాణానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.బూత్ కౌంటర్లు ఏర్పాటు చేసి
మేడారం జాతరకు తరలివెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం, ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను బస్సులలో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు.టికెట్ కౌంటర్లు 24 గంటలు పనిచేస్తాయి.కాగా జాతరకు సుమారు 400 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం తగిన ఏర్పాటు చేయడం తో పాటు త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్, తగు సూచనలను, సలహాలను అందించడానికి హెల్ప్ డెస్క్, మెడికల్ సదుపాయం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ వివరించారు.భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవార్ల గద్దెల అతి సమీపం వరకు చేరుకుంటారని కావున ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందగలరని ఆమె కోరారు.
