గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
బంజారాల సంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. ఈ పండుగ బంజారాల జీవన విధానాన్ని వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది.బంజారాల కట్టు,బొట్టు,సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుంది. ఒక ప్రాంత ప్రత్యేకతను అక్కడి ప్రజల జీవన విధానాన్ని పండుగలు చాటి చెబుతాయి.వారి సంస్కృతి, చారిత్రక నేపథ్యం, వారసత్వాలకు,సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రతీకగా నిలుస్తాయి. ఇలా ప్రత్యేకమైన అహార్యం, కళలు, పండుగలు తమ పూర్వికులు ఇచ్చిన ఆస్తిగా అవి అంతరించిపోకుండా చూసుకుంటున్నారు గిరిజన ప్రజలు.తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించడం తీజ్ పండుగ ఉద్దేశం.తండాలో వర్షాలు బాగా కురిసి,ప్రతి తండా ప్రకృతి,పచ్చదనంతో కలకలలాడుతూ ఎల్లప్పుడూ పచ్చగా హరిత భరితంగా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు.ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా తీజ్ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,గోవా, కర్ణాటక, దక్షిణ భారతదేశం,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్గడ్,రాజస్థాన్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు.వెదురు బుట్టలోనే కాకుండా మోదుగు ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి గోధుమలను చల్లుతారు. పెళ్లి కానీ ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టలో ఉన్న గోధుమలకు నీళ్లు జల్లుతారు.ఆడపిల్లలు పులియాగొన్నో- పూర్ణకుంభం తలపై పెట్టుకుని బావినీళ్లు, బోరింగ్ నీళ్లు గాని,చెరువు నీళ్లు కానీ తీసుకువచ్చి తీజ్ కి పోస్తారు.గోధుమ మొలకలను తీజ్ గా పిలుస్తారు.తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టతో ఆడపిల్లలు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుతారు.పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరి ప్రజలు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో తిజ్ వద్దకు చేరుకుంటారు.
లాంబీ లాంబి ఏ లాంబడి ఏ కేరియో,దొకా కేరియే లాంబడి ఏ కెరియ, తోనకున బోరయో తీజ పావ్ లేనా,సేవా భయా బోరయో తిజ బయిరో పావ్ లేనా అంటూ పాటలు పాడుతారు. 9 రోజుల తీజ్ పండుగ సందర్భంగా ఆడపిల్లలకు కఠినమైన నియమాలు ఉంటాయి.ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటికి వెళ్ళకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే.నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకుని నిలబడాల్సిందే.నానబెట్టిన శనగలను రేగి మూళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడి ఝాస్కెరో పేరుతో పిలుస్తారు.చివరి రోజు నిమజ్జనం కనుల పండువగా బంజారా వేషధారణలో నిర్వహిస్తారు.నిమజ్జన కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు,యువతీ, యువకులు, ఉద్యోగస్తులు, పెద్ద ఎత్తున పాల్గొంటారు.తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.