జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 2026(IPL)లో చోటు కోల్పోయిన ముస్తాఫిజుర్ రెహమాన్(Mustafizur Rahman )కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ పేస్ విభాగం బాధ్యతలు మోయనున్నారు. మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్‌ను ప్రధాన స్పిన్నర్లుగా తీసుకున్నారు. బ్యాటింగ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్‌పై బంగ్లా ఎక్కువగా ఆధారపడనుంది.
గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచులను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్(ఫిబ్రవరి 7), ఇటలీ(ఫిబ్రవరి 9), ఇంగ్లండ్(ఫిబ్రవరి 14), నేపాల్(ఫిబ్రవరి 17) మ్యాచులు ఆడాల్సి ఉంది.బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు మొత్తం 40 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. సూపర్ 8 దశ అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ కోల్‌కతా, కొలంబో, ముంబైలో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించనున్నారు.
