సింగారం మల్లన్న పాదాల ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసిన డిప్యూటీ చైర్మన్

తొలి మొక్కుల మహా పవిత్ర క్షేత్రంలో డిప్యూటీ చైర్మన్ ప్రత్యేక దర్శనం

సింగారం కోటగండిపై మల్లన్న పాదాలు – తెలంగాణ ఆధ్యాత్మికతకు ప్రతీక

వరంగల్ జిల్లా, నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు చిరునామాగా నిలిచిన తొలి మొక్కుల మహా పవిత్ర క్షేత్రం సింగారం గ్రామంలోని కోటగండి శ్రీ మల్లికార్జున స్వామి వారి పాదాల గుడిని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ బుధవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శాంతి, సుభిక్షం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కాకతీయుల కాలం నుంచి ప్రజల విశ్వాసాలకు కేంద్రంగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రంలో దర్శనం చేయడం తనకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని డా. బండ ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైతులు, అలాగే వివిధ జిల్లాల నుంచి తిమ్మాపురం మీదుగా అయ్యనవోలు జాతరకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ మల్లన్న స్వామి పాదాల గుడి ఉండటంతో, జాతర సమయంలో వేలాదిగా భక్తులు ఇక్కడ తొలి మొక్కులు తీర్చుకుంటారని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. జాతర లేని రోజుల్లోనూ తిమ్మాపురం, అల్లీపురం, కొండపర్తి, నర్సింహులగూడెం, ముల్కలగూడెం, మామునూరు, సింగారం గ్రామాల ప్రజలు శుభకార్యాలు, ప్రయాణాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా మల్లన్న స్వామి పాదాలకు మొక్కులు తీర్చుకుని బయలుదేరడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.
ఇళ్లలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, కొత్త కార్యక్రమాల ప్రారంభానికి ముందు మల్లన్న స్వామి పాదాలను దర్శించడం ఈ ప్రాంత ప్రజల అచంచల విశ్వాసమని పేర్కొన్నారు. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

“పవిత్ర క్షేత్రాల సంరక్షణ మన అందరి బాధ్యత”
ఈ సందర్భంగా డా. బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ,

“కాకతీయుల కాలం నుంచి ప్రజల విశ్వాసాలకు నిలయంగా ఉన్న మల్లన్న స్వామి పాదాలు తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇటువంటి పవిత్ర క్షేత్రాలను కాపాడుకోవడం, అభివృద్ధి చేయడం మన అందరి బాధ్యత” అని స్పష్టం చేశారు.

సింగారం గ్రామానికి గర్వకారణం.

ఆలయ మాజీ డైరెక్టర్ సొనబోయిన సతీష్ మాట్లాడుతూ, అతి పురాతనమైన పుట్టకోటపై మల్లన్న స్వామి పాదాలు వెలసి ఉండటం సింగారం గ్రామానికే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు గర్వకారణమని తెలిపారు. తరతరాలుగా ఈ క్షేత్రం తొలి మొక్కుల స్థలంగా కొనసాగుతుండటం ఈ ఆలయ విశిష్టతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోపతి జపాల్ రెడ్డి, గుర్రాల సమ్మిరెడ్డి, ముత్యాల ఉప్పలయ్య, శెవ్వ రాజు, అంబేద్కర్ రాజు, నాగరాజు, వెంకటేశ్వర్లు, బొల్లు రాజు, కట్కూరి సురేష్, ఆడెపు శ్రీను, రాములు, హరినాథ్ రెడ్డి, మహేష్, మహేందర్, చందు తదితరులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version