తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…
– పీవీ బ్రిడ్జికి రిపేరు చేయించలేని దుస్థితి ఎమ్యెల్యేది
– 16నెలలైనా ఓడేడ్‌ వంతెనకు తట్టెడు మట్టి తీయలే
– అవసరం లేని చోట రూ.300కోట్లతో బ్రిడ్జి మంజూరు
– ఐదేండ్లలో మంథని అభివృద్ది ప్రణాళిక చెప్పని మంత్రి
– ప్రజల అవసరాలను గుర్తించని మంథని ఎమ్మెల్యే
– అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

 

40ఏండ్లు నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి సమీపంలోని మానేరు బ్రిడ్జి మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఆనాడు స్వర్గీయ పీవీ నర్సింహరావు మంథని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారని అన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తండ్రి కొడుకులు ఒక్క వంతెనను తీసుకురాలేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా రెండు బ్రిడ్జిలుమంజూరు చేయించామని, ఒక్కటి ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా మరొకటి ఓడేడ్‌ వద్ద నిర్మాణంలో ఉందన్నారు. తాను అనేక మార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలేదంటే పేరుకోసం తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ కోసం రూ.300కోట్లతో అవసరం లేనిచోట బ్రిడ్జిని తీసుకువచ్చారని అన్నారు. ఆ రూ.300కోట్ల నిధులతో మంథని మండలం ఆరెంద మానేరు లేకపోతే అడవిసోమన్‌పల్లి వద్ద మరో బ్రిడ్జి నిర్మిస్తే అద్బుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మంథని ఎమ్మెల్యే మంత్రిగా అయి 16నెలలు గడుస్తున్న సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండటం విడ్డూరమని, కనీసం మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చకుండా ఇంత పెద్ద పదవిలో ఉండి ఏ ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌, జర్మనీ తరహాలో అభివృధ్ది చేస్తామని, ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు చెబుతున్నారని, మార్పు, అభివృధ్ది ఏమో కానీ ఈ బ్రిడ్జి మాత్రం రిపేరుకు నోచుకోవడం లేదన్నారు. గత 25రోజుల క్రితం మరమ్మత్తు పనులు ప్రారంభించి మధ్యలోనే అపివేయడంతో వాహనదారులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఈ బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, కనీసం ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోరా అని ఆయన అన్నారు. మంత్రి పదవి వస్తే ఎంతో అబివృద్ది జరుగుతుందని, అనేక ప్రయోజనాలు ఉంటాయనుకుంటే చీకట్లోకే నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు. సోమన్‌పల్లి బ్రిడ్జికి రిపేరు చేయకపోగా ఓడేడు బ్రిడ్జి వద్దకు వెళ్లి పనుల్లో నాణ్యతపై విచారణ చేయిస్తామని, బాధ్యులతపై చర్యలు తీసుకుంటామని మాట్లాడిన మంత్రి 16 నెలలు గడుస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ మరమ్మత్తులు పూర్తి చేయకపోగా ఓడేడుబ్రిడ్జి పనులు మొదలు పెట్టకుండా అవసరం లేనిచోట రూ.300కోట్ల నిధులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో మానేరు, గోదావరి, ఆలయాలు, అడవులు, భూములు ఉన్న ఈ నియోజకవర్గ అభివృధ్దిపై ఇప్పటి వరకు ప్రణాళిక చెప్పలేదని, ఐదేండ్లలో అభివృద్ది గురించి చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఎక్కడ ఏం అవసరం ఉంటుందనే విషయంపై మంత్రికి అవగాహణ లేదని అర్థం అవుతోందని, కేవలం ప్రజలను గొర్రెల్లా ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, నోట్ల కట్టలతో ఓట్లు వేయించుకోవచ్చనే ఆలోచన ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి మరమ్మత్తు పనులను పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version