మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అభ్యర్థులు బరిలోకి
పుర పోరుకు జనసైనికులు సిద్ధం కావాలి :– తాళ్లపెల్లి బాలు గౌడ్
వరంగల్, నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగనుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు, జనసేన పార్టీ జిల్లా నాయకులు తాళ్లపెల్లి బాలు గౌడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపే యోచనలో పార్టీ ఉందని ఆయన స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, హనుమకొండ జిల్లాలోని పరకాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్, కేసముద్రం, స్టేషన్ ఘనపూర్, జనగామ, చేర్యాల మున్సిపాలిటీల్లో జనసేన పోటీలో ఉంటుందని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై జనసేన అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని, పుర పోరులో జనసేన శక్తిని చాటాల్సిన సమయం ఆసన్నమైందని తాళ్లపెల్లి బాలు గౌడ్ పేర్కొన్నారు.
