ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం
రాయపర్తి మండలం, పెరికేడు గ్రామంలో అవగాహన కార్యక్రమం.
నేటిధాత్రి, రాయపర్తి.
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, పెరికేడు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టి డి ఎస్ ఏ) ఆధ్వర్యంలో ప్రాజెక్ట్–4 లో భాగంగా ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్ ఫర్ ఎవరీ చైల్డ్) అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. ఆశిష్ రామడుగు సమర్థవంతంగా సమన్వయం చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు (ఓరల్ చెకప్) నిర్వహించారు. అలాగే చిన్నారులకు నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత, దంతాల సంరక్షణ విధానాలు, చెడు నోటి అలవాట్ల ప్రభావం, సరైన బ్రషింగ్ పద్ధతుల వంటి అంశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరణతో పాటు ప్రాక్టికల్ డెమో ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం చిన్నారుల్లో నోటి ఆరోగ్యం పట్ల చైతన్యం పెంచడంలో ఎంతో ఉపయోగపడిందని పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభిప్రాయపడ్డారు.
