సీతారామ ప్రాజెక్టు పనులను పరిశిలించిన రైతు సంఘంనాయకులు.

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశిలించిన రైతు సంఘంనాయకులు.

సీతారామ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ది కనపర్చి
అండర్ టర్నెల్ పనులు ప్రారంభించాలి.

ప్రాజెక్టు పూర్తికి ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలి.

కారేపల్లి నేటిధాత్రి

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టుకు పూర్తికి ప్రభుత్వం చిత్తశుద్దితో నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి చీమలపాడు వద్ద అండర్ టర్నెల్ నిర్మాణం చేసే గుట్టల ప్రాంతాన్ని తెలంగాణ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కు అందాలని మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం 100 రోజుల మహాప్రస్ధానం గోదావరి జలాల సాధన పాదయాత్రతో దుమ్ముగూడెం ప్రాజెక్టు వెలుగులోకి వచ్చిందన్నారు. సీతారామ ప్రాజెక్టుగా పేరుమారిన ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా లో కారేపల్లి కామేపల్లి రఘనాధపాలెం ఖమ్మం రూరల్ తిరుమలాయపాలెం కుసుమంచి మండలాల్లో భూములకు సాగునీరు అందించటంతో పాటు నాగార్జునసాగర్ ఆయకట్టు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గుట్టల వరకు ప్రధాన కాలువలు పూర్తి అయ్యాయని ఖమ్మంజిల్లాలో తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు వద్ద పనులు జరిగాయని తెలిపారు.

సీతారామ ప్రాజెక్టు ప్రధాన పనులలో కారేపల్లి మండలం చీమలపాడు జూలూరుపాడు మండలం పాపకొల్లు గుట్టల్లో 2 కిలోమీటర్ల అండర్ టర్నెల్ నిర్మాణం పనులు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మాత్రం దీర్ఘ కాలం పట్టే పనులు ప్రారంభం చేయకుండా కేవలం మట్టి కాలువలు తవ్వకం చేయడం ఆశ్చర్య పరుస్తుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కేవలం రూ.336 కోట్లు మాత్రమే కేటాయించారని బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా లోని ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలు అందించేందుకు పూర్తిభాధ్యత వహించాలన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు లు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం భూసేకరణలో నిర్వాసిత రైతులకు వేరు వేరు భూమి ధరలు నిర్ణయించి పరిహారం అందించడం సరికాదన్నారు. భూములు కోల్పోయిన రైతులందరికి ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు సేకరించిన భూమిలోని పంట ఫలసాయం రైతులకే చెందాలని దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు నాయకులు మద్దెల నాగయ్య ఎర్రిపోతు భద్రయ్య సూరపాక ధనమ్మ దారవత్ వినోద్ మాడపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version