దోబి పేట్ క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వివేక్
* కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం
* కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్న
మంత్రి వివేక్, ఎమ్మెల్యే యాదయ్య
నేటిధాత్రి, చేవెళ్ల :
శంకర్పల్లి మండలం దోబి పేట్‌లోని ఎన్ సి సి కంపెనీలో సోమవారం భారీ క్రేన్ కూలటంతో జరిగిన ప్రమాదంలో గాయపడి శంకర్‌పల్లి పట్టణంలోని లలిత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కార్మికులను మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య క్షతగాత్రులను పరామర్శించారు.
గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకుని , బాధితులకు కంపెనీ బాధ్యత వహిస్తూ యాజమాన్యం తరఫున అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైన పరిహారం అందేలా యాజమాన్యంతో చర్చిస్తామని తెలిపారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
