డైరీ వ్యర్థలతో కలుషితమైన చెరువులు..
*రసాయనాల దెబ్బతో మృతి చెందిన చేపలు, పాములు..
*ఆందోళనలో పసుపత్తూరు పంచాయతీ వాసులు..
*తక్షణం స్పందించి చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్..
*వెంటనే సమస్య పరిష్కారం కావాడమే గాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..
*పంచాయతీ ప్రజలు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి..
పలమనేరు(నేటిధాత్రి)అక్టోబర్ 29:
గంగవరం మండలంలోని ఒక ప్రైవేటు డైరీ కారణంగా పలు చెరువులు కలుషితంగా మారాయి.ఆ డైరీ నుంచి వెలువడే రసాయనలతో కూడిన కలుషిత నీరు చెరువులకు చేరడంతో చేపలు మరియు పాములు మృతి చెందాయి. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణమే స్పందించి బుధవారం గంగవరం మండలం పసుపత్తూరు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు, అధికారులతో కలసి పరిశీలించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఫామ్ గెట్ డైరీ వ్యర్థాల కారణంగా వనపకుంట, తూము గుంట, కమ్మ వాళ్ళ కుంట చెరువులలో నీరు కలుషితమై చేపలు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారుల అలసత్వంపై తీవ్ర అగ్రహానికి గురైన ఆయన వారిని అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులలో కలుషితమైన నీటిని ప్రజలు వినియోగించకుండా చూడాలని అదేవిధంగా పశువులు ఇతర జంతువులు నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక అదే విధంగా చెరువులలో నీరు కలుషితం కావడానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్, ఫిషరీస్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచి రాబట్టాలని అధికారులకు తెలిపారు. భవిష్యత్తులో తిరిగి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరో వైపు చెరువు కట్టలు, సప్లై ఛానల్ కు సంబంధించి వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను అధికారులు త్వరగా పరిష్కరిస్తారని అంతవరకు పంచాయతీ వాసులు కలుషితమైన నీటిని వాడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న,
తహసిల్దార్ రేఖా రెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్లా నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ, సర్వేయర్ రవి,అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్ పయనిలతో పాటు గంగవరం మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్,ప్రతాప్ రెడ్డి,ప్రసాద్ నాయుడు, భాస్కర్ రెడ్డి,గిరిధర్ గోపాల్, సోము, శేఖర్,రెడ్డప్ప, శీన, హేమగిరి తదితరులున్నారు.
