*విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ సమస్య..
*లోక్‌సభలో ప్రశ్నించిన తిరుపతి ఎంపి గురుమూర్తి..
తిరుపతి( నేటి ధాత్రి)జూలై 25:
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఇంటర్న్‌షిప్ సమస్యల గురించి తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఇదే సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఎంపి శుక్రవారం మరోసారి పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా మూడేళ్ల కోర్సు చేయాలని నిబంధన ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసా,ఈ నిబంధన ఇతర రాష్ట్రాలలో ఉన్న ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్‌కు భిన్నంగా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ పరిస్థితులలో వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి, జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ వ్యవధిలో ఒకటే నిబంధన ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది,
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, అలా అయితే వివరాలు తెలుపగలరు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు భారతదేశంలో వైద్యం చేయడానికి లైసెన్స్ లేదా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పొందడానికి నేషనల్ మెడికల్ కమిషన్ 2021లో జారీ చేసిన నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.ఈ నియమాలు దేశవ్యాప్తంగా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు అందరికీ ఒకేలా వర్తిస్తాయని పేర్కొన్నారు. కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ కు సంబంధించిన నియమాలను నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు 2021ని అనుసరించి నిర్వహించబడతాయని తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి, యుద్ధాలు వంటి పరిస్థితుల వలన విద్యను అభ్యసించడంలో వచ్చిన అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ మెడికల్ కమిషన్ 2023 డిసెంబర్ 7న, 2024 జూన్ 19న పబ్లిక్ నోటీసుల ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలియజేసారునేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు గురించి వివరిస్తూ..
విదేశాలలో వైద్య, విద్యను అభ్యసిస్తూ చివరి సంవత్సరంలో బ్రేక్ వచ్చి, ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 1 సంవత్సరం క్లినికల్ క్లర్క్ షిప్ చేయాలి. ఆ తర్వాత వైద్య కళాశాల నుండి లేదా గుర్తింపు పొందిన సంస్థలో 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని పేర్కొన్నారు.
చివరి సంవత్సరానికి ముందు సంవత్సరంలో బ్రేక్ వచ్చి, ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 2 సంవత్సరాల క్లినికల్ క్లర్క్ షిప్ చేయాలి. ఆ తర్వాత 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని తెలిపారు.
ఆన్‌లైన్ క్లాసులకు బదులుగా నేరుగా హాజరై, సరిపడా ప్రాక్టికల్ శిక్షణ పొంది, పూర్తి కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హులని తెలియజేశారునేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా రూపొందించబడ్డాయని, వీటి విషయంలో రాష్ట్రాలు వేర్వేరు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఎంపి గురుమూర్తి స్పందన ; ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు మూడు సంవత్సరాల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేస్తున్నారని, ఇది ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో వేర్వేరు ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్ పాలసీలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఆర్థిక, వృత్తి పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల నిరసన కార్యక్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఒకే విధమైన నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపి గురుమూర్తి డిమాండ్ చేసారు…