నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని తోంబైరెండు సర్పంచ్, ఎనిమిది వందల అరవై ఆరు వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈనేపథ్యంలో రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రామడుగు తహసిల్దార్ రాజేశ్వరి, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు, తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version