ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్ లో ఓటర్‌గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి…
◆:- దాంతో ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే
◆:- ఆధార్ సరైనదో కాదో తేల్చే హక్కు ఈసీకి ఉంది
◆:- కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం
◆:- ఆధార్ పౌరసత్వ గుర్తింపు కాదని స్పష్టీకరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్‌లో ఓటర్‌గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకునే 11 డాక్యుమెంట్లకు అదనంగా 12వ డాక్యుమెంట్‌గా
ఆధార్ కార్జును చేర్చాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా ఆధార్‌ను ఈసీ అధికారులు ఆమోదించడం లేదని ఆర్జేడీ, ఎంఐఎం ఇతర పార్టీలు పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్‌గా గుర్తించేందుకు ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా సమర్పించడాన్ని ఆమోదించాలని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కింది స్థాయిలో అధికారులంతా ఆధార్‌ను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆమోదించాలని ఆదేశాలు జారీ చేయాలని, తమ వెబ్సైట్లలో ఈ విషయం స్పష్టం చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అదే సమయంలో ఆధార్‌తో పాటు ఓటర్ సమర్పించిన డాక్యుమెంట్లు ఏవైనా సరైనవా కాదా తనిఖీ చేసే అధికారం ఈసీకి ఉన్నదని కోర్టు స్పష్టం చేసింది ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్జు కాదని ఆధార్ చట్టంలోనే ఉందని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం మనిషిని గుర్తించేందుకు అది ఉపయోగపడుతుందని తెలిపింది. ఆధార్ కార్డును కూడా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇచ్చిన హామీ పత్రాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది.
ఆధార్ ఓకే అంటే షోకాజ్ ఇచ్చారు
ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నియోజకవర్గ స్థాయి ఓటర్ల నమోదు అధికారులు(ఈఆర్వో), బూత్ స్థాయి అధికారులు ఆమోదించడం లేదని, బూత్ స్థాయి అధికారి ఆధార్‌ను అంగీకరించినందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆర్జేడీ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆధార్ కార్డును ఆమోదించాల్సిందిగా ఇంతవరకూ ఈసీ తమ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేదీ వాదిస్తూ ఆధార్‌ను పౌరసత్వానికి రుజువుగా భావించలేమని చెప్పారు. కపిల్ సిబల్ స్పందిస్తూ, పౌరసత్వాన్ని గుర్తించే బాధ్యత ఈసీది కాదని అన్నారు. ఒక వ్యక్తి పౌరుడా కాదా అన్న విషయం నిర్ణయించే అధికారం ఈసీకి ఉన్నదని, ఈ విషయం స్పష్టం చేయాలని రాకేశ్ ద్వివేదీ సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఈసీ కోరిన 11 డాక్యుమెంట్లలో పాస్‌పోర్టు, పుట్టినతేదీ సర్టిఫికెట్ తప్ప మిగతా వేవీ పౌరసత్వాన్ని ధ్రువీకరించవని న్యాయమూర్తి బాగ్చీ ఎత్తి చూపారు. వాదోపవాదాల తర్వాత చివరకు రేషన్ కార్డు, ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఆధార్‌ను 12వ డాక్యుమెంట్‌గా చేర్చి ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు రుజువుగా స్వీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే ఆధార్ కార్డు సరైనదో కాదో తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.