*తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక క్రీడలపై సంపూర్ణ నిషేధం.
*సంప్రదాయం ముసుగులో జీవ హింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము.
*కోడి పందాలు, జూదం నిర్వహించినా, వాటికి స్థలాలు లేదా పొలాలు కల్పించినా, నిర్వాహకులు, పాల్గొన్న వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు…
*డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బృందాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగించబడుతుంది…
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.,
తిరుపతి(నేటిధాత్రి:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో కోడి పందాలు, పేకాట, మట్కా తదితర జూద క్రీడలు నిర్వహించడం, ఆడటం, ఆడించడటం చట్టరీత్యా నేరమని తిరుపతి జిల్లా ఎస్పీ
ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహించుకోవాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
సంప్రదాయం పేరుతో జీవ హింసకు పాల్పడటం నేరమని, కోడి పందాలు వంటి క్రీడలు జంతు సంక్షేమ చట్టాలకు పూర్తిగా విరుద్ధమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఇటువంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమైనవని, నేరస్థులపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, మూగజీవాల సంక్షేమ బోర్డు సభ్యులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కోడి పందేల నిర్వహణకు ప్రయత్నిస్తున్న నిర్వాహకులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించామని, అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే, కోడి పందేల నిర్వహణ కోసం స్థలం లేదా పొలాలు అందించిన వారు, పందేల కోసం కోళ్లకు కత్తులు కట్టిన వారు, వాటిని తయారు చేసిన వారు లేదా సరఫరా చేసిన వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
జూదం, మట్కా వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల వలన సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో పడి కొందరు ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని, ఇది కుటుంబాలకు మరియు సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి అక్రమ క్రీడలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల సహాయంతో గతంలో కోడి పందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలు, నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక క్రీడలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తిరుపతి జిల్లాలో ఎవరైనా కోడి పందేల నిర్వహణ కోసం బరులు ఏర్పాటు చేసినా, స్థలం లేదా పొలం ఇచ్చినా, పందేల నిర్వహణకు సహకరించినా లేదా వాటిలో పాల్గొన్నా, అందరిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గౌరవ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., మరోసారి కఠినంగా హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్: 80999 99977 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
