ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి..
ఆర్కే ఫోర్ గడ్డ ఏరియాను ఓసి ప్రభావిత ప్రాంతంగా గుర్తిస్తాం…
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఆర్కేపి ఉపరితల గని ప్రభావిత ప్రాంతమైన ఆర్కే ఫోర్ గడ్డ ఏరియా ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తానని, వార్డులలో ఉన్న సమస్యలను, ప్రజా సమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ పాల్గొన్నారు.పట్టణంలోని 3,4,17,18,19 వార్డ్ లలో పర్యటించారు.
రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించాలని మంత్రిని ఆర్కే ఫోర్ గడ్డ ప్రజలు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. మంత్రి వెంట మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మందమర్రి ఏరియా సింగరేణి జిఎం రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు లకు ఉపరితల గని బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆదేశించారు.3,18 వార్డుల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
పలు కాలనీలో బెల్ట్ షాపులతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలపగా వెంటనే బెల్ట్ షాపులను అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి ప్రాంతంలో నిలిపివేసిన 76 జీవోను అమలు చేసి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయాలని వార్డుల్లోనీ ప్రజలు కోరగా , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి సింగరేణి భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టాలను ఇచ్చేలా కృషి చేయాలని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పర్యటిస్తున్నానని మునిసిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
