సమ్మరైనా..సమయమేదైనా..తెగ్గేదేలే!

సమ్మరైనా..సమయమేదైనా..తెగ్గేదేలే!

మండే ఎండలోనూ పరకాలలో చాయ దుకాణాల్లో జనం రద్దీ

పరకాల,నేటిధాత్రి

వేసవి ఎండలు భగ్గుమంటున్నా పరకాల పట్టణంలో చాయ ప్రేమికుల సందడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచే వేడి తీవ్రత పెరుగుతున్నా,పట్టణంలోని చాయ దుకాణాలు మాత్రం ఎప్పటిలాగే జనంతో కిటకిటలాడుతున్నాయి.ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్న వేళ కూడా ప్రజలు చాయ దుకాణాల వద్దకు చేరుకుని వేడి వేడి చాయను ఆస్వాదిస్తున్నారు.సాధారణంగా ఎండాకాలంలో ప్రజలు చల్లని పానీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని భావించినప్పటికీ,పరకాలలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.చల్లని డ్రింక్స్, జ్యూసులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది ఇంకా చాయనే తమ మొదటి ఎంపికగా భావిస్తున్నారు.ఉదయం పనులకు వెళ్లే కార్మికులు,ఉద్యోగులు,ఆటో డ్రైవర్లు,వ్యాపారులు,యువకులు రోజును చాయతోనే ప్రారంభిస్తున్నారు.ఇక మండే ఎండ వేడిని తట్టుకోలేక ఓ వృద్ధుడు తలపై తువాలు చుట్టుకొని చాయ తాగుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.చెమటలు కారుతున్నా చేతిలో చాయ కప్పుతో కూర్చొని నెమ్మదిగా టీ ఆస్వాదించడం అక్కడి వారిని ఆలోచింపజేసింది.ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా ఒక కప్పు చాయ తాగితేనే కాస్త ఉపశమనం లభిస్తుందని పలువురు చాయ ప్రియులు చెబుతున్నారు.

మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కొంతసేపు నీడలో నిలబడి అయినా చాయ తాగుతూ కనిపిస్తున్నారు.పట్టణంలోని బస్టాండ్,మార్కెట్ ప్రాంతం,ప్రధాన కూడళ్లు,కార్యాలయాల సమీపంలోని చాయ దుకాణాల వద్ద ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అధిక రద్దీకనిపిస్తోంది.కొందరు స్నేహితులతో కలిసి చాయ తాగుతూ రాజకీయాలు,క్రికెట్,స్థానిక విషయాలపై చర్చలు జరుపుతుండగా,మరికొందరు పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాయను ఆశ్రయిస్తున్నారు.చాయ దుకాణాల నిర్వాహకులు కూడా వేసవి కాలంలో వ్యాపారం తగ్గుతుందని భావించినప్పటికీ,ప్రస్తుతం ఆశించిన విధంగానే వినియోగదారులు వస్తున్నారని చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు,సాయంత్రం 4 గంటల తర్వాత చాయ దుకాణాల వద్ద రద్దీగా ఉంటుందని తెలిపారు.ఎండ ఎంత ఉన్నా ఒక కప్పు చాయ తాగితేనే ఉత్సాహంగా ఉంటుందని అలసట తగ్గి శరీరానికి కాస్త ఉపశమనం లభించినట్టుగా అనిపిస్తుందని పలువురు చాయ ప్రేమికులు చెబుతున్నారు.కొందరు అయితే రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చాయ తాగకుండా ఉండలేమని అంటున్నారు.ఇక మండే ఎండల మధ్య వేడి చాయ తాగుతున్న ప్రజలను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ,పరకాలలో మాత్రం “చాయంటే చాయే” అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.వేసవి తీవ్రత ఎంత పెరిగినా చాయపై ప్రేమ మాత్రం తగ్గడం లేదని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version