హైదరాబాద్, సెప్టెంబర్ 11, 2024 (బుధవారం) : బంజారా హిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఈరోజు శ్రీ రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ భగవానుని నిత్య సఖీమణి శ్రీమతి రాధారాణి యొక్క దివ్య ఆవిర్భావ తిథియైన శుభ సందర్భంగా నగరంలోని అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివార్ల దివ్య ఆశీస్సులను పొందారు.
నేటి ఉదయం నుండి శ్రీశ్రీ రాధా గోవిందులు అద్భుతమైన నవవస్త్రాలు మరియు అత్యద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి, భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించబడిన దేవాలయమంతా పరిమళభరితమైంది. సాయంసంధ్యా వేళలో వైదిక ఋత్విక్కుల వేద మంత్రోచ్ఛారణలు మరియు శ్రావ్యమైన హరినామ సంకీర్తనల నడుమ 108 కలశాలతో శ్రీ రాధాగోవింద అభిషేకం అట్టహాసంగా నిర్వహించబడింది.
అభిషేకంలో భాగంగా, శ్రీ రాధా గోవిందులకు పంచామృతము (పాలు, పెరుగు, తేనె మొదలైనవి), పంచగవ్యము (ఆవు నుండి 5 పవిత్రమైన వస్తువులు), వివిధ రకాల పండ్ల రసాలు, అరుదైన వన మూలికలు, వివిధ రకాల సుగంధ పుష్పాలు, ప్రత్యేక ఓషధులు, నవరత్నాలు మొదలైనవి భక్తిభావంతో సమర్పించబడ్డాయి. శ్రీ రాధాగోవిందుల ప్రీత్యర్థం భక్తులంతా భక్తిపారవశ్యంతో “శ్రీ రాధాష్టకము”ను గానం చేశారు. స్వామి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన చప్పన్ భోగ్ (56 విశేషమైన ఆహార పదార్థాలతో కూడిన నైవేద్యం) వేడుకల్లోని మరో విశేషం. ఆ తరువాత స్వామివార్లకు విశేషమైన హారతిని అందించారు.
హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ అధ్యక్షులైన పూజ్యశ్రీ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ (M. Tech, IIT చెన్నై) వారు తమ ప్రవచనంలో రాధాష్టమి యొక్క ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. భాద్రపద మాసం (ఆగస్టు-సెప్టెంబర్) శుక్ల పక్ష అష్టమి తిథినాడు ఈ భువిపై అవతరించిన శ్రీమతి రాధారాణి సమస్త జగత్తుకూ తల్లి వంటిదని, ఈ పవిత్రమైన రోజున భక్తులంతా తమకు కృష్ణ భక్తిని ప్రసాదించమని ఆ తల్లిని ప్రార్థిస్తారని వారు వివరించారు. షోడశోపచారములు, శృంగార హారతి, రాజ భోగ్ హారతి, సంధ్యా హారతి, మహాభిషేకం, ఝూలన్ (ఊంజల) సేవ, మహాపల్లకీ సేవ, శయన హారతి, ఏకాంత సేవ మొదలైన పలు విశేష సేవలన్నీ ఈ ఉత్సవంలో స్వామివార్లకు నిశితంగా నిర్వహించబడ్డాయి.
మందిర సందర్శకుల సౌకర్యార్థం ఆలయంలో విస్తృతమైన ఏర్పాట్లను చేయడమే గాక, వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ రుచికరమైన భోజన ప్రసాదాలను కూడా అందించడం జరిగింది.