ఎస్పీ ఆకస్మిక తనిఖీ..పెండింగ్ కేసులు, రికార్డుల పరిశీలన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ ను
ఎస్పీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డుల తనిఖీ చేశారు. లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్.బి.డబ్ల్యూ చేదనకు సబ్-డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీఎస్పీ కి సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అన్నీ వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్.హెచ్.ఓ లకు సూచించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
గణేష్ నిమర్జనాలను పురస్కరించుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలు, గుడులపై రంగులు పడకుండా ఎత్తైన బారికెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడి నుంచి వినాయక నిమర్జనాలు జరగనున్న నారింజ బ్రిడ్జ్ ను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. నిమర్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా క్రేన్ లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్పీకి సూచించారు.
సంఘవిద్రోహ శక్తుల నుండి కాపాడాలి
జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు మందిరంలో ఏర్పాటు చేసిన వినాయక పూజకు ఎస్పీ హాజరై, గణనాధునికి ప్రత్యేక పూజలు చేసారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అల్లర్లు సృష్టించే సంఘవిద్రోహ శక్తులనుండి కాపాడాలని, జిల్లా ప్రజలను సుఖ:సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వాదహించాలని గణనాధునికి వేడుకున్నారు. ఈ సందర్శనలో ఎస్పీతో డీఎస్పీ సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, రూరల్ ఎస్ఐ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.