మహిళల రక్షణకు షీ టీమ్స్ సేవలు వినియోగించుకోవాలి
నర్సంపేట షీ టీమ్ ఎస్ఐ స్వాతి
నర్సంపేట, నేటిధాత్రి:
మహిళలు, బాలికల రక్షణ కోసం షీ టీమ్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట షీ టీమ్స్ ఎస్ఐ స్వాతి సూచించారు.నర్సంపేట పట్టణంలోని విస్డం పాఠశాలలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ వరంగల్, ప్రతిభా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా మానవ అక్రమ రవాణా, మహిళలపై హింసకు వ్యతిరేకంగా శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో మాట్లాడిన ఎస్ఐ స్వాతి.. ప్రస్తుత సమాజంలో కుటుంబం నుంచి మొదలుకుని అన్నిచోట్ల మహిళలు, బాలికలను వేధించేవారి సంఖ్య పెరిగిందని అన్నారు. భౌతికంగా, ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా వేధింపులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఎవరైనా మహిళలు, పిల్లలను వేధిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత మహిళలు షీ టీమ్స్‌ను సంప్రదించి వివరాలు గోప్యంగా తెలియజేయవచ్చని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మహిళలు ఎక్కువగా పనిచేసే చోట్ల వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ పెన్నం శ్రీలక్ష్మీ రామానంద్ అన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు జూలూరి రోజా రాణి, రామోజీ రోజా రాణి, వేల్పుల శ్రీలత, ఎఫ్ఎంఎం సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, శ్రీకాంత్, ప్రతిభా సంస్థ కార్యదర్శి జి.సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సంస్థ కార్యదర్శి బి.ప్రభాకర్, బోయిన వెంకటస్వామి తదితరులతో పాటు 70 మంది మహిళలు పాల్గొన్నారు.
