వానొస్తే ఐలోని ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేస్తుంది.
సరైన డ్రైనేజి వ్యవస్థ లేక గేట్ల వద్దే నిలిచి ఉంటున్న వర్షపు నీరు
ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు రోగుల పాట్లు
ఎక్కడా చోటు లేనట్టు ఆసుపత్రి ఆవరణంలోనే మిషన్ భగీరధ వాటర్ ట్యాంకు
ట్యాంకు నిర్వహణ లేక ఎక్కువైన నీరు ఆసుపత్రి స్లంపులోకి వెళ్తున్న వైనం
వర్షపు నీటి ప్రవాహనికి అడ్డంగా ఉన్న విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్
ప్రమాదం జరిగేలా ఉన్నా, పట్టించుకోని తహసీల్దార్ కార్యాలయం
ఆదాయం లేని చోటు అందుకేనా అటు వైపు చూడని రాజకీయ కనికట్టు
నేటిధాత్రి ఐనవోలు :-
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రంగా ఉన్న అయినవోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో 2003 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినవోలులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. అప్పటినుండి పేద ప్రజల ఆరోగ్య వరప్రదాయనిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలు లేమితో కొట్టుమిట్టాడుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల దృష్టిలో పెట్టుకొని గ్రామీణ పేదలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. దాంతో అయినవోలు మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆస్పత్రికి వచ్చి మెరుగైన చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావు సారథ్యంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు దాదాపు 100 మంది ఓ.పి.రోగులకు సేవలు అందిస్తూ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. మరి ఇంతలా గ్రామీణ పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ఆవరణ చిన్న వర్షానికే చెరువును తలపిస్తుంది. ఆసుపత్రిలోకి వెళ్లే రెండు మార్గాల వద్ద వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. అసలే జ్వరాలతో నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగులు అడ్డుగా వర్షపు నీరులో నుంచి తడుస్తూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీటిలో నుండే వెళ్లే క్రమంలో వృద్ధులు కిందపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశము ఉందని అంతేకాకుండా జరం తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు మరియు మలేరియా డెంగ్యూ లక్షణాలు ఉన్న రోగులకు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ విభాగంలో ఉంచి డాక్టర్ శ్రీనివాసరావు నుంచి చికిత్స అందిస్తున్నారు.మరి అలాంటి రోగులు కూడా ఈ వర్షం నేను నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాపించి మరిన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకనే..
అని ఆసుపత్రి నిర్మాణ సమయంలో ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కానీ, వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దాంతో చిన్న వర్షానికి ఆవరణలో వర్షపు నీరు ఎక్కడివి అక్కడే నిలిచి బురదమయం అయ్యి దుర్గంధం వెదజల్లుతుంది. గతంలో వర్షం నీరు వెళ్లేందుకు ఆసుపత్రి తూర్పు భాగంలో ప్రహరీకి ఒక గండి పెట్టగా వరద నీరు ఆ మార్గం గుండా బయటికి వెళ్ళేది. అయితే ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం, పక్కనే ఉన్న నిర్మాణాలు మరియు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇటీవల వేసిన సీసీ రోడ్డు ఎత్తుగా ఉండడం చేత ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వరద నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ మార్గం గుండా వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేశారని, దాంతో నీరు బయటికి పోకుండా అలాగే నిలిచి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పాలకుల స్వార్థం రోగులకు ప్రాణ సంకటం
గతంలో ఉన్న పాలకులు మండల కేంద్రంలో ఎక్కడా చోటు లేదు అన్నట్లుగా ఆసుపత్రి ఆవరణలోనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు.అయితే నిర్మాణం అయితే చేపట్టారు గాని దాని నిర్వహణ సరిగా లేనందున వాటర్ ట్యాంక్ నిండి పోగా ఎక్కువైన నీరు ఆసుపత్రి మెడికల్ వేస్టేజ్ కోసం నిర్మించిన స్లంపులోకి వెళ్తుంది. అది కూడా పూర్తిగా నిండిపోయిన తర్వాత నీరు బయటికి ప్రవహించి ఆసుపత్రి ఆవరణలో నిలిచిపోయి అసౌకర్యానికి కారణమవుతున్నది.
ఆసుపత్రిపై అధికార పాలక వర్గాల శీత కన్ను
నిత్యం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీరు నిలువ ఉండకుండా ఆవరణ అంతా మెయిన్ రోడ్డు లెవల్ మట్టి పోయించాల్సిన అవసరం ఉంది. వర్షం నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ మట్టి పోయించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిండిన తర్వాత వచ్చే నీరు బయటికి వెళ్లేలా సరైన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆసుపత్రిలో మరిన్ని గదులు నిర్మాణం చేపట్టి 30 పడకల ఆసుపత్రిగా అప్డేట్ అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.