కనికరం లేని నిర్మాతలు!

-కార్మికుల కష్టం దోచుకుంటున్నారు!

-సినీ పెద్దలు కూడా సుద్దులు వింటున్నారా?

-ఐటి ఉద్యోగులతో సమానమైన జీతాలంటూ అబద్దాలు!

-25000 కార్మికులకు నెలంతా పనిస్తున్నారా?

-ప్రతి రోజూ పని కల్పిస్తున్నారా?

-ఏడాదిలో సగం రోజులు పని లేని కార్మికులే ఎక్కువ!

-హీరోలకు సినిమా సినిమాకు పెరుగుతున్న పారితోషికాలు!

-మూడేళ్లకోసారి కార్మికులకు 10 శాతం పెంచలేరా?

-సగటు కార్మికుడికి ఇచ్చే కూలీ రెండు వేలు.

-నెలలో పనికి పిలిచేది పది రోజులు.

-పది రోజులు కూలీతో కార్మికుడు బతికేదెట్లా?

-సినిమాలు వందల కోట్లు పెట్టి తీస్తున్నామంటారు.

-అందులో కార్మికులకు కనీసం పది శాతం ఖర్చు చేస్తున్నారా?

-తెలుగు కార్మికుల పొట్టగొట్టేందుకు ముంబై మనుషులా?

-ముంబై కార్మికులకు రాజభోగాలా?

-తెలుగు కార్మికులు పస్తులుండాలా?

-కార్మిక లోకం శ్రమ దోపిడి ఇంకెంత కాలం?

-పాన్‌ ఇండియా సినిమాలు తీస్తారు!

-కార్మికుడు కనీసం ఇక పాన్‌ కొనుక్కోవాలంటే ధైర్యం చేయలేడు?

-కార్మికుల బలహీనతలు సొమ్ము చేసుకుంటున్నారు.

-వారి పొట్టగొట్టి హీరోల కడుపు నింపుతున్నారు.

-కార్మికుల అచేనత్వం ఆసరా చేసుకుంటున్నారు.

-కార్మికుల కడుపు నింపడానికి ముందూ, వెనుక ఆలోచిస్తున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          సినిమా తీసేవాడు ఖర్చంటాడు. సినిమాలో నటించే హీరో రెమ్యునరేషన్‌ అంటాడు. సినిమా నిర్మాణానికి కష్టపడే కార్మికుడి చేత వెట్టి చారికీ చేయించుకుంటారు. సినిమా రంగంలో పనిచేయాలనుకునేవారిలో కూడా రెండు రకాలుంటారు. సినిమాలకు పనిచేస్తే డబ్బులు బాగా వస్తాయని వచ్చే వారు కొంత మంది వుంటారు. సినిమా వాళ్లను చూసుకుంటూ బతేకాయాలన్న పిచ్చితో కొంత మంది వస్తుంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా సినిమా అంటే ఒకరకమైన పిచ్చి. ఆ పిచ్చిని ఆసరాగా చేసుకొని నిర్మాతలు కార్మికులను కాల్చుకుతింటుంటారు. ప్రతి పరిశ్రమకు కూడా మనుషులు కావాలి. పని చేసేవారు కావాలి. అందుకు సినిమాకు కూడా కార్మికులు కావాలి. ఒక సినిమా వల్ల కొన్ని వేల మంది కార్మికులకు అన్నం దొరుకుతుందని గొప్పలు చెప్పుకుంటుంటారు. ప్రొడక్షన్‌ పేరు చెప్పి లెక్కలు చెబుతుంటారు. గతంలో అలా వుండేది. ఇప్పుడు ఇలా వుంది. అంటూ తమను తాము ఈవెంట్లలో చెప్పుకున్నంత గొప్పగా కార్మికుల జీవితాలు లేవు. వారి జీవితమంతా కన్నీళ్లే. వారి బతుకంతా వ్యధలే. వారికి రోజు వారి కూలీ ఇచ్చేందుకే ఏడ్చి చచ్చే నిర్మాతలు వారిని గొప్పగా చూసుకున్నామని చెప్పడమంత పచ్చి అబద్దం మరొకటి వుండదు. కార్మికులకు సినిమా షూటింగ్‌ సమయంలో తామే వారికి భోజనాలు ఏర్పాటు చేస్తామని చెబుతారు. వారికి అన్నం పెడుతున్నామని అంటారు. నిజంగా నిర్మాతలందరూ కార్మికుల కడుపు నింపుతున్నారా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఎంత పెద్ద ప్రొడక్షనైనా సరే రెండే ఇడ్లీలు అని పెట్టడం లోకానికి తెలియందా? కార్మికులకు తెలియందా? ఎంతోమంది కార్మికులు అర్ధాకలితో పనిచేస్తారన్న సంగతి తెలియందా? ఎంతో బరువులు మోసే లైట్‌ మ్యాన్‌లకు ఇచ్చే ఫలహారం ఎంతో తెలియందా? మధ్యాహ్నం భోజనం ఎంత మోతాదులు పెడతారో బైటకు తెలియందా? ఎనమిది గంటలు పనిచేయాల్సిన సినీ కార్మికుల చేత 12గంటలకు పైగా పనిచేయించుకొని, వారికి భోజనం పెట్టి చేతులు దులుకోవడం లేదా? షూటింగ్‌ సమయంలో ఒక్క పూట భోజనం పెట్టి, కార్మికుల కుటుంబాలను తామే పోషిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటారు. ఇంత పెద్దగా చెప్పుకునే నిర్మాతలు, కార్మికులకు ఉదారంగా పారితోషికం పెంచడమనడం లేదు. అయినా కార్మికులకు ఇచ్చేవి జీతాలు కాదు. చెప్పుకోవడానికి గొప్పగా వుండడం కోసం చెప్పే మాట పారితోషికం. అంటే కూలీ. అది కూడా దినసరి కూలీ రూ.2000. తెలుగు చిత్ర పరిశ్రమలో మొత్తం సభ్యులే సుమారు 25వేల మంది అన్ని రకాల కార్మికులుంటారు. ఇక సభ్యత్వం కూడా లేని వాళ్లు మరో 30వేల మంది వుంటారు. ఇంత మంది చిత్రపరిశ్రమను నమ్మకొని బతుకుతున్నారు. సినిమా తప్ప వారికి మరో ప్రపంచం తెలియదు. సినిమా మీద వున్న పిచ్చితో నిర్మాతలను నమ్ముకంటే అర్ధాకలి తీర్చుతున్నారు. చాలీ చాలని కూలీ చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు తేజ కూడా కార్మికుల జీవితాల గురించి వెకిలిగా మాట్లాడడం విడ్డూరం. సినిమా అంటే తెలియని, దాని విలువ తెలియని వాళ్లు మాట్లాడడం అంటే వేరు. కాని తాను చిన్నప్పుడు పెట్రోల్‌ బంక్‌లో పనిచేశారు. రోడ్డు మీద వుండే అరుగుల మీద పడుకున్నాను. ఏం చదువుకోలేదు. లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి తాను ఎదిగాను అని చెప్పుకునే తేజకు కార్మికుల కష్టం తెలియదా? మర్చిపోయాడా? తాను కష్టపడి పైకొచ్చానని చెప్పే తేజ ఆరోజుల్లో కూడా కార్మికులను ఇలాగే చూసి వుంటే తేజ అనే వ్యక్తి సినీ ప్రపంచంలో ఎదిగేవారా? కార్మికులకు ఐటి ఉద్యోగులతో సమానమైన జీతాలు ఇస్తున్నారంటూ మా గొప్పగా తేజ చెప్పారు. మన సమాజంలో ఐటి ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు వుండే వ్యవస్ధలు అనేకం వున్నాయి. ఐటిలో వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుంటాయి. రోజుకు 8గంటలు మాత్రమే పని వుంటుంది. జీతాలు లక్షల్లో వుంటాయి. కాని మరి సినీ కార్మికులకు అలాంటి వెసులుబాటు వుంటుంది. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, చెరువుల్లో, ఎత్తైన ప్రదేశాలలో, జన జీవనం లేని ప్రాంతాల్లో, ఎడారుల్లో , ఎండనక, వాననక, చలి అనక ఎలాంటి లోకేషన్లలోనైనా సరే పనిచేస్తారు. కడుపుకు మార్చుకొని సినిమాకు కోసం కష్టపడతారు. మరి ఐటి ఉద్యోగులు ఇవన్నీ చేయగలరా? ఒక ఐటి కంపనీ వంద కోట్లతో పెడుతారు. అదే ఒక సినిమా వందల కోట్లతో తీస్తారు. అలాంటప్పుడు ఒక కార్మికుడికి ఎంత రెమ్యునరేషన్‌ రావాలి? సినిమా పూర్తయ్యే సరికి కనీసం ఒక్క కార్మికుడికి లక్షలు చేతికి రావాలి. వస్తున్నాయా? కనీసం లక్ష రూపాయలైనా ఇస్తున్నారా? రోజుకు రెండు వేలు ఇస్తూ, మరో పది శాతం పెంచమని కోరుతుంటే, వారికి గొంతెమ్మకోరికలు అనే హక్కు నిర్మాతలకు లేదు. తాజాగా ఓ నిర్మాత మాకు ఎలాంటి వర్కర్స్‌ అవసరం లేదంటున్నారు. అంటే సినిమా కోసం కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ ఎప్పుడో అప్పుడు తమ జీవితాలకు వెలుగులు రాకపోతయా? అని ఎదరుచూసే వారు ఎక్కువగా వుంటారు. నిజంచెప్పాలంటే లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి మొదలు, సినిమా పిచ్చితో వచ్చేవారే. వాళ్లు లైట్లు మోస్తున్నారంటే మొరటు వ్యక్తులు కాదు. తమకు వున్న నాలెడ్జీని ఎప్పుడైనా, ఎవరికైనా వినిపించే అవకాశం రాదా? అప్పుడు తమ జీవితాలు, తల రాతలు మారకపోతాయా? అని ఎదురుచూస్తుంటారు. సినిమా పరిశ్రమలో చేస్తూ పోతుంటే ఏదో ఒక అవకాశం రాకుండా వుంటుందా? అనే నమ్మకం. అంతే కాని వాళ్లు కూలీలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో పెద్ద డైరెక్టర్లు, రయితలకన్నా గొప్ప కళ వున్న వాళ్లుకూడాఎంతో మంది వున్నారు. వెలుగులోకి రాకుండా తమ ఆశలు సమాది చేసుకుంటున్న వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. సరే ఆ అవకాశం కొద్ది మందికే వస్తుంది. అవకాశం కోసం ఎదురుచూసే వారి సంఖ్య వేలల్లో వుంటుంది. అందుకే సినీ పరిశ్రమ పచ్చగా వుంది. ఇంతగా వెలుగుతోంది. ఎంతో మంది దర్శకులు, ఇతర పెద్ద టెక్నీషియన్లు, చిన్న కార్మికుల చెప్పే కధలు దొబ్బేసేవారున్నారు. కార్మికులు చెప్పిన కథలను సినిమాలుగా తీసిన వారున్నారు. ఒక రకంగాచెప్పాలంటే సినీ రంగంలో పనిచేసే కార్మికులుకూడా గొప్ప కళాకారులే! నటించాలని, పెద్ద నటుడు కావాలని వచ్చిన వారు కూడా లైట్‌ మాన్‌లుగా పనిచేస్తున్న వారు కూడా వున్నారు. తెరమీద ఒక్కసారి కనిపించినా చాలు అనుకొని కార్మికులుగా పనిచేస్తున్న వారు కొన్ని వేల మంది వున్నారు. కార్మికులుగా పనిచేసే తామలో ఈ టాలెంట్‌ వుందని బైటకు చెప్పుకోలేని పరిస్ధితుల్లో కూడా బతుకుతున్నారు. అలాంటి క్రియేటర్లను అడ్డామీద కూలీలకన్నా అద్వాహ్నంగా చూసే నిర్మాతలు కూడా వుంటారు. అయినా ఎక్కడా తమ కార్మికులు తమ కోపాన్ని ప్రదర్శించలేరు. డిమాండ్‌ మేరకు కూలీని వసూలు చేసుకోలేరు. కార్మికులకు ఇప్పటికీ పరిశ్రమ 20 కోట్ల వరకు బాకీ వుందని కూడా లెక్కలు చెబుతున్నాయి. సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే కార్మికులను పంపించే నిర్మాతలు కార్మికులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినవాళ్లు కూడా వున్నారు. సినిమా పోయిందని, మరో సినిమా ఆశ చూపి, అడగకుండా తప్పించుకునేవారున్నారు. రెండు సినిమాలది కలిసి ఒకేసారి ఇస్తామని కార్మికులకు మాయ మాటలు చెప్పే నిర్మాతలు కూడా వున్నారు. ఏ వ్యవస్ధలోనై మోస పోయేది..కార్మికులే. ఇక్కడ కూడా అంతే..సినిమా పరిశ్రమ అంటే సినిమా అంత అందగా వుండదు. ఆ సినిమాకు పనిచేసే కార్మికుల జీవితాలు కార్మాగారాలలో పనిచేసే వారికంటే హీనంగా కూడా వుంటాయి. పైకి చెప్పుకోలేక, తమలో తాము కుంగిపోయే కార్మికులు ఎంతో మంది వున్నారు. ఇప్పటికైనా కార్మికుల ఉసురు పోసుకోకండి. కార్మికుల సొమ్ముతో నిర్మాతలు బాగు పడేది వుండదు. కార్మికుల కోసం హీరోల రెమ్యునరేషన్‌ తగ్గించండి. దర్శకులు కొంత త్యాగంచేయండి. ప్రొడక్షన్‌ కాస్టు తగ్గించుకోండి. కానీ కార్మికులకు అన్నం పెట్టడం మానకండి. వారి కడుపులు కొట్టకండి. వారి జీవితాలు ఆగం చేయకండి. కార్మికులు లేకుండా ఏది నడవదు. ముంబై నుంచి వచ్చే వారు ఎల్ల కాలం తెలుగు నిర్మాతలకు ఊడిగంచేయరు. కడుపులో పెట్టుకొని, ఆకలిని చంపుకొని సినిమాను నిలబెట్టే తెలుగు కార్మికులు చాలా మంది వున్నారు. వారిని కడుపులో పెట్టుకొండి. గొప్ప గొప్ప సినిమాలు తీయండి. కార్మికుల దీవెనలతో కోట్లు సంపాదించుకోండి. ఇది నేటిధాత్రి సూచన. కార్మిక లోకం పక్షాన నిర్మాతలకు అక్షరాల నివేదన.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version