భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు మూడు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా రక్షణ చర్యలలో అప్రమత్తంగా ఉండాలని,జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు,వాగులు, లోతట్టు ప్రాంతాలలో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉదృతంగా ప్రవహించే నదులు,వాగుల వద్దకు ఎవరు వెళ్లకూడదని,పోలీసు శాఖ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్ళకూడదని,రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని,అత్యవసర సమయాలలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని తెలిపారు.తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాల కొరకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్ ఏర్పాటు చేసి, 24 గంటలు తక్షణ సహాయం సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని,జిల్లాలో వరద,ఘటనల సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు అందించాలని తెలిపారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటుందని,ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.
