పాన్ మసాలా దొంగల అరెస్టు
◆:- ఇద్దరి దుండగులను జైలుకు తరలింపు
ఇతర దుండగుల కోసం ముమ్మర గాలింపు
◆:- వివరాలను వెల్లడించిన జహీరాబాద్ డిఎస్పి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కర్ణాటకలోని బీదర్ నుండి మధ్యప్రదేశ్ కు అక్రమంగా పాన్ మసాలాను తరలిస్తున్న ఓ లారీని.. మేము పోలీసుల మంటూ పట్టపగలె చోరీకి పాల్పడ్డ దుండగులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇద్దరు దుండగులను జైలుకు తరలించగా.. పరారీలో ఉన్న మరికొందరి దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశం మేరకు గురువారం సాయంత్రం జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బీదర్ లోని ఆర్ కే ప్రొడక్ట్స్ కర్మాగారం నుండి పాన్ మసాలాను ఈ నెల 10న మధ్యాహ్నం జహీరాబాద్ బీదర్ రోడ్డు, న్యాల్ కల్ మండలంలోని గంగువార్ గ్రామ శివారు వద్ద రూ:19.59 లక్షల విలువచేసే పాన్ మసాలాను లారీలో తరలిస్తుండగా.. కొందరు దుండగులు మాటువేసి. మేము పోలీసులమంటూ, భయభ్రాంతులకు గురిచేసి పాన్ మసాలాను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకొని పరారయ్యారు. లారీలో ఉన్న ఓ వ్యక్తివద్ద నుండి రూ:42 వేల నగదును దోచుకున్నారు. రవి సూర్యకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి వెంటనే ముమ్మర గాలింపు చేపట్టారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పర్యవేక్షణలో.. స్థానిక ఎస్సై సుజిత్, రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్, ఝరాసంఘం ఎస్సై పాటిల్ క్రాంతి, జహీరాబాద్ రూరల్ పోలీసుల బృందం సుభాష్, రాజశేఖర్, అశోక్, సాయికిరణ్, మహేష్, శ్రీకాంత్, అప్రోచ్, సాయికుమార్, తదితరులు పాన్ మసాలా తోపాటు లారీని అపహరించిన దుండగుల కోసం మూడు రోజుల పాటు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇద్దరు నిందితులు, లారీని పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు.
మమ్మద్ ఖరీం, సక్లేన్ల అరెస్ట్, జైలుకు తరలింపు…
పట్టపగలే చోరీకి పాల్పడ్డ పలువురి నిందితుల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక హద్దునూర్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి వివరాలను వెల్లడించారు. జహీరాబాద్ చెందిన మమ్మద్ ఖరీం (32), బీదర్ కు చెందిన సక్లెన్ (26) లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు, అతి త్వరలోనే అదుపులోకి తీసుకొని.. అరెస్టు చేసి, జైలుకు తరలించినట్లు డి.ఎస్.పి వెల్లడించారు. రూ:19.59 లక్షల విలువగల పాన్ మసాలా, రూ:15 లక్షల విలువగల లారీని అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. రూ:42 వేలను దొంగలించిన దుండగుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పట్టపగలే చోరీకి పాల్పడ్డ దుండగుల (ఇద్దరు)ను, లారీని త్వరితగతిన అదుపులోకి తీసుకోవడం పట్ల.. స్థానిక సీఐ, ఎస్సైలు, పోలీసుల బృందాన్ని డి.ఎస్.పి అభినందించారు.
