మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం సరికాదు
– కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధుల శాతం తగ్గించడం సరికాదు
– ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు
గ్రామాల్లో పర్యటనకు పిలుపు

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు
యం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ రక్షణ పోరాటం పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటన కార్యక్రమాలకు పిలుపులో భాగంగా శనివారము కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ
2005 సంవత్సరంలో అప్పటి యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా గ్రామస్తుల ఇండ్లకు తాళాలు వేసి ఉండడాన్ని గమనించి ప్రభుత్వం తరఫున బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో మెదక్ జిల్లాలో అంకురార్పణ చేశారు.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5 నుంచి 6 కోట్ల మంది బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పనికి తగిన వేతనం కల్పించేలా ఉపాధి హామీ చట్టాన్ని అప్పటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రూపొందించింది. రోజులో రెండు నుంచి మూడు గంటలు పని కల్పించే వందరోజుల ఉపాధి హామీ గ్యారంటీ పథకాన్ని అమలు చేశారు.
12 సంవత్సరాల క్రితం కేంద్రంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన బిజెపి ప్రభుత్వం పేదలకు ఉపాధినిచ్చే పథకంతో పాటు పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించే పథకాలు అన్నింటికీ తూట్లు పొడిచే విధంగా పథకాలకు మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విబిజిరాంజీ అనే పేరుగా మార్చడంతోపాటు, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధుల శాతాన్ని తగ్గించే విధంగా పథకంలో మార్పులు చేశారు. 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న ఈ పథకం పేరు మార్చడమే కాకుండా 60 శాతం మాత్రమే కేంద్రం భరించేలా మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించేలా పథకాన్ని రూపొందించారు. ఇలా పేదలకు ఉపాధినిచ్చే పథకాలలో మార్పులు చేస్తూ కార్పొరేట్లకు సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారు.

కార్పొరేట్ కంపెనీలకు కార్మికులు దొరికే పరిస్థితి లేనందున ఉపాధి హామీ పథకాన్ని కాంట్రాక్టర్లకు అనుకూలంగా మార్చి కార్పొరేట్లకు దాసోహం చేసే ప్రయత్నం జరుగుతుంది.

గతంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేసే మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చింది. దేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోయే ఈ చట్టాలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలోని అఖిలపక్షంతో కలిసి రైతులతో ఉద్యమించడంతో మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. విబిజి రాంజీ అనే పేరుతో సవరణ చేసిన చట్టాన్ని తిరిగి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చి, చేసిన సవరణలను ఉపసంహరించుకునే వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఈనెల 8 నుంచి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, తెలంగాణలో ఈనెల 20 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అందరికీ తెలిసే విధంగా బిజెపి ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్న నష్టాలను వివరించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి తెలిసే విధంగా ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామస్తులు, ఫీల్డ్ అసిస్టెంట్ల మద్దతు కూడగట్టుకుని దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నాం. ఆ తదుపరి ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కూడా ఉండడున్నాయి. వి బి జి రాంజీ పేరును ఉపసంహరించుకుని, చట్టాన్ని ఇంతకుముందు ఉన్నట్టు యధావిధిగా కొనసాగించే వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తాం.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపొందించినప్పుడు 226 రకాల పనులను ఆయా గ్రామాల్లో అవసరం మేరకు చేయించేలా వెసులుబాటు కల్పించారు. కానీ ప్రస్తుతం ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా నాలుగు రకాల పనులకే అవకాశం కల్పించింది.

ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టిఎ మెంబర్ సంగీతం శ్రీనాథ్, బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ అధ్యక్షులు సూర దేవరాజు, మైనార్టీ నాయకులు సాహెబ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, మాజీ కౌన్సిలర్ రాగుల జగన్,పూర్మాని లింగారెడ్డి, బొప్ప దేవయ్య, కత్తెర దేవదాస్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version