నాట్య సుందరి” అవార్డు గ్రహీత…! శ్రీనిధి
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు సట్ల పావని ప్రభాకర్ కుమార్తె చిన్నారి సట్ల శ్రీనిధి ఎంతో ప్రతిష్టాత్మకమైన “నాట్య వసుందరి 2026” అవార్డును అందుకొని గ్రామానికి, మండలానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.
న్యూఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన నేషనల్ డాన్స్ అవార్డు ఫెస్టివల్‌లో ఈ అరుదైన గౌరవాన్ని చిన్నారి శ్రీనిధి సొంతం చేసుకుంది.
దేశంలోని పలు రాష్ట్రాల నుండి పాల్గొన్న ప్రతిభావంతుల మధ్య తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ నృత్య కళను అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది.
చిన్న వయసులోనే అసాధారణమైన నాట్య ప్రతిభను కనబరిచిన శ్రీనిధి తన కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందననీయం.
న్యాయనిర్ణేతలు సైతం శ్రీనిధి ప్రతిభను ప్రశంసిస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ అవార్డు కేవలం శ్రీనిధికే కాకుండా తెలంగాణ సాంస్కృతిక వైభవానికి లభించిన గౌరవంగా అందరూ కొనియాడుతున్నారు.
చిన్నారి విజయంలో తల్లిదండ్రులు సట్ల ప్రభాకర్, పావని ప్రోత్సాహం ఎంతో కీలకమైంది.
పిల్లల ప్రతిభను గుర్తించి చిన్నప్పటి నుంచే కళల వైపు నడిపించడం వారి గొప్పదనానికి నిదర్శనం.విద్యతో పాటు కళలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ శ్రీనిధిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను అందరూ అభినందిస్తున్నారు.
కుమార్తె భవిష్యత్తు కోసం వారు చేసిన కృషి ఈ విజయంతో నమోదు అయిందని వారు సంతోషపడుతున్నారు.శ్రీనిధి సాధించిన ఈ ఘనత కోరుకొండపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
గ్రామ ప్రజలు చిన్నారిని అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు.
ఈ విజయానికి ప్రధాన కారకులైన నాట్య గురువు సరిత కి ప్రత్యేక ధన్యవాదాలు, నాట్య కళాకారిని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు.
శ్రీనిధిలోని ప్రతిభను వెలికితీసి సరైన శిక్షణ అందించిన గురువు సేవలు ప్రశంసనీయం.కళ పట్ల అంకితభావంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ అనేక మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న సరిత నిజమైన కళామాతగా నిలుస్తున్నారు.
శ్రీనిధి ప్రతి అడుగులోనూ గురువు యొక్క మార్గదర్శకత్వం ఎంతో తోడ్పడింది.
క్రమశిక్షణ, సాధన, నిబద్ధతతో కళను నేర్పించిన ఫలితమే ఈ అవార్డు అని అందరూ భావిస్తున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో తెలంగాణ పేరు మారుమోగించడం విశేషం.
అక్కడికి హాజరైన పలువురు ప్రముఖులు చిన్నారి ప్రదర్శనను ప్రశంసించారు.
