జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా సందర్శించారు.నియోజకవర్గ పరిధిలో డయోరియా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రోజున చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. రోగులను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకొని, వారికి అందుతున్న వైద్యం పట్ల ఆరా తీశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటిస్తూ, మెరుగైన వైద్య సేవలను అందించాలని,గ్రామీణ ప్రజలకు వ్యాధి లక్షణాల గురించి,తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించాలని సూచించారు.దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతోపాటు వైద్యం అందించాలని సూచించారు.వైద్యులు,సిబ్బంది,విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి,ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.