`ఎంతో మంది తల్లిదండ్రులు కడుపుకోతను అనుభవిస్తున్నారు.
`కుక్కల మీద కనికరం.. పిల్లల మీద లేదా!?

`ఇంత దిక్కుమాలిన వ్యవస్థలో బతుకుతున్నామా?
`నిత్యం ఎక్కడో ఒకచోట కుక్క కరిచి అనే వార్తలు చూస్తూనే వున్నాం.
`రేబిస్ బారిన పడి చనిపోతున్నారని వింటూనే వున్నాం.
`కుక్కల దాడిలో చిన్న పిల్లలు చనిపోతున్నా పాపకులకు పట్టదా!
`జంతు ప్రేమికులారా జర ఆలోచించండి.
`కుక్కల మీద వున్న ప్రేమ పిల్లల మీద లేదా!
`పిల్లల ప్రాణాలకన్నా కుక్కల ప్రాణమే ఎక్కువైపోయిందా!
`జంతు ప్రేమికుల ముసుగులో జనం ప్రాణాలతో చెలగాటమా!
హైదరాబాద్, నేటిధాత్రి:
సమాజమే మానవత్వమనే పదానికి అర్దాన్ని మార్చేస్తుంది. మానవత్వమనే పదానికే రంగులు మార్చుతుంది. అవును. ఇది ముమ్మాటికీ నిజం. ఒకప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు. అనేవారు. మనిషే కుక్కను కరిస్తే వార్త అవుతుందని చెప్పుకునే వారు. ఎందుకంటే ఒకప్పుడు కుక్క కరిస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. పల్లెల్లో ఏదో మంత్రం వేసే వాళ్లు. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే బొడ్డుచుట్టూ ఇంజక్షన్లు ఇచ్చేవారు. తర్వాత మరింత అలాంటి అవసరం లేని ఖరీదైన వైద్యం కూడ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు కుక్క కాటు అనే వార్త ఎప్పుడో వింటుండేది. ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారన్న విషయం తెలియక ఇంట్లోకి వెళ్తే కుక్క కరిచింది అని చెప్పడం విన్నాం. లేకపోతే పిచ్చి కుక్క కరిచింది అనే వార్తలు విన్నాం. కాని నిత్యం కుక్క కరిచిన వార్తలను కోకొల్లలుగా వినడం మాత్రం ఇటీవల బాగా పెరిగింది. ప్రతి ఏటా మన దేశంలో కుక్క కాటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య పది లక్షలు వుంటుందనే వార్త వింటుంటే గుండె గుబేల్‌మనక మానదు. ఇంతలా కుక్కల దాడిలో మనుషులు మరణిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారు. వ్యవస్ధలు ఏం చేస్తున్నాయి. గ్రామాలలో పంచాయితీలు ఏం చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్న అందరికీ టక్కున తెలుత్తుంది. ఈ వ్యవస్ధలన్నీ పనిచేయాలనే అనుకుంటున్నాయి. కాని ఇటీవల మూగజీవాల మీద ప్రేమ కురిపించే వాళ్లు చాలా పెరిగిపోయారు. వాళ్లంతా ఎక్కడో వుండరు. సెల్ ఫోన్లో వుంటారు. కుక్కలను పట్టుకొని వెళ్తుంటే వాళ్లు తట్టుకోలేరు. కుక్కలకు ఏదైనా హాని జరిగితే వారి మనసు విలవిలలాడపోతుంది. అది కూడా కేవలం సెల్‌పోన్లో మాత్రమే…అవే వీధి కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తుంటే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. అయ్యో అని కూడా అనరు. కుక్క కనిపించినప్పుడు జాగ్రత్తగా వుండాలి కదా? అని నీతులు చెబుతారు. వీధుల్లో కుక్కలున్నాయని తెలిసినప్పుడు పిల్లలను బైటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కదా! హితవులు పలుకుతున్నారు. అంతే కాని వీధుల్లో గుంంపులు గుంపులుగా పెరిగిపోతున్నా కుక్కలను నిర్మూలించండి అని మాత్రం అడిగే వాళ్లు లేకుండాపోయారు. ఎవరు ఎలా పోతే మాకేమిటి? అనే ఓ పిరికి బ్యాచ్ వుంటుంది. వారి వరకు వస్తే గాని అయ్యో అన్యాయమైపోయామే! అంటుంటారు. ఇక మరికొందరు జంతు ప్రేమికులు. వాళ్లకు మనుషులకన్నా జంతువులే ఎక్కువ. వారిలో మనుషులపై కనిపించని జాలి, దయ , కరుణ అన్నీ జంతువులపై మాత్రమే కురిపిస్తారు. ఇంట్లో పెంచుకునే కుక్కలను మాత్రం సొంత పిల్లలుగా చూసుకుంటారు. ఆ కుక్కలకు ఏమైనా అయితే మాత్రం విలవిలలాడిపోతున్నట్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కన్న పిల్లలకన్నా కుక్కల మీద ప్రేమ కురిపిస్తూ వీడియోలు చేస్తుంటారు. అయితే ఇంట్లో పెంచుకునే హైబ్రీడ్ కుక్కపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్‌లు వేయిస్తారు. వాటికి స్నానం చేయిస్తారు. కొంత శుభ్రత తీసుకుంటారు. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనం వేసుకునే చెప్పులు, కుక్కలు ఇంటి ముందే వుండాలన్నారు. కాని అదేంటో ఇప్పుడు చెప్పులు కూడా ఇంట్లో వాడుతున్నారు. బైట వుండాల్సిన కుక్కలను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లకు వీధి కుక్కలంటే ప్రేమ ఏమీ వుండదు. కాని కుక్క అనగానే వారిలో ప్రేమ పొంగిపోయినట్లు నటిస్తుంటారు. డిల్లీ నుంచి గల్లీ వరకు నిత్యం ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడిలో చనిపోతున్నారు. గాయాల పాలౌతున్నారు. రేబిస్ వ్యాధి బారిన పడి భయంకరమైన చావును చూస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లలు కూడా ఇలాంటి పరిస్దితులను ఎదుర్కొని నరకం చూస్తూ చనిపోతుంటే కూడా కొంత మందికి పాపం అనిపించడం లేదు. వాళ్లే జంతు ప్రేమికులు. వారి మానవత్వం మనుషుల మీద కాన్న కుక్కల మీద ఎక్కువౌతోంది. ఇది మానవత్వం మంట కలవడం కాదా? మనుషుల మీద మనుషులే విషం నింపుకోవడం కాదా? ఒక కాకిని కొడితే వంద కాకులొస్తాయి. గాయి గాయి చేస్తాయి. కొట్టిన వ్యక్తిని వెంటాడుతాయి. వేదిస్తాయి. ఇంట్లో నుంచి బైటకు రాకుండా చిత్ర వధ చేస్తాయి. ఒక కోతిని కొడితే నాలుగు కోతులు మీదకు వస్తాయి. కాని ఒక వ్యక్తిని ఎవరైనా కొడుతుంటే చూస్తూ వుండిపోతారు. గతంలో ఇలా చూస్తూపోయేవారు. కాని ఇప్పుడు సెల్‌పోన్లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా పిల్లలు కుక్కల దాడికి గురైన సందర్భంలో సిసి టివీలలో రికార్డు అయ్యే వీడియోలు కొన్ని అయితే, వాటిని షూట్ చేసి పోస్టు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. ఇటీవల కర్నూల్‌లో బస్సు తగలబడి పోతుంటే, బస్సు అద్దాలు పగలగొట్టాల్సిన వాళ్లు వీడియోలు తీశారని కూడా అంటున్నారు. ఇలాంటివి చూస్తుంటే, వింటుంటే మనం మనుషులమేనా అనిపించకమానదు. నిజం చెప్పాలంటే అసలు మనం మనుషులమే కాదు. అభం శుభం తెలియని పసిపిల్లలను కుక్కలు మీద పడి కరుస్తూ, పీక్కు తింటున్నాయి. అవి మూగ జీవాలు కాదు. కోరలున్న జంతువులు. కొరికి కొరికి చంపుకుతినే జంతువులు. సాదు స్వభావంలో వున్న రాక్షస జాతి జంతువు. దాని మీద జాలి చూపిస్తూ పోతే జనం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సి బతకాల్సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాళ్లు కూడా జంతు ప్రేమికులౌతుంటారు. కన్నతల్లికి అన్నం పెట్టని వాళ్లు కూడా కుక్కల కోసం తల్లడిల్లిపోతున్నట్లు నటిస్తున్నారు. ఇలాంటి వాళ్లు దేశానికి ఎంతో ప్రమాదకరం. ఆఖరుకు సుప్రింకోర్టు తీర్పును కూడా తప్పు పట్టే స్ధాయికి చేరుకున్నారు. అలాంటి పిచ్చి ప్రేమికుల గురించి ఆలోచించకుండా పాలకలు కఠినంగా వ్యవహరించాలి. వీది కుక్కల నిర్మూలన చేపట్టాలి. గతంలో ఇలా కుక్కలు పెరిగిన సందర్భాలలో గ్రామ పంచాయితీ నుంచి మొదలు మున్సిపాలిటీల వరకు కుక్కలను పట్టుకెళ్లి చంపి, పూడ్చిపెట్టేవారు. అలా కుక్కల బెడత తీర్చేవాళ్లు. ఇప్పుడు ఆ పనిని వదిలేస్తున్నారు. జంతు ప్రేమికులకు భయపడి ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వాలు చోద్యం చూడడం కూడా సరైంది కాదు.