నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి
◆-: ఝరాసంగం ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు, యువత నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించుకోవడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే తమ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని ఝరాసంగం ఇన్ స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి వేడుకలకు అనుమతి లేదని ర్యాలీల పై పూర్తిగా నిషేధం ఉందని అన్నారు నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించడం, అనుమతి లేకుండా పార్టీలను ఏర్పాటు చేయడం, డీజేలు, భారీ సౌండ్ తో శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి చర్యలు చట్టరీత్యా నిషేధించబడినవని స్పష్టం చేశారు.
ఈ నిషేధాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీలు ఉంటాయన్నారు. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని తమ ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రజల క్షేమమే పోలీసుల ప్రధాన ధ్యేయమని, యువత క్షేమమే సమాజ భవిష్యత్తని భావించి ఈ సూచనలు జారీ చేయడం జరుగుతుందన్నారు.
