మందమర్రి పోలీసులు ప్రజల భద్రత కోసం
మందమర్రి నేటి ధాత్రి
పిచ్చి మొక్కల తొలగింపుతో ప్రమాదాల నివారణకు ముందడుగు
ప్రజల భాగస్వామ్యంతో ఎస్సై రాజశేఖర్ ప్రత్యేక చొరవ
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మందమర్రి పోలీసులు చిర్రకుంట సారంగపల్లి గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న సారంగపల్లి చిర్రకుంట బీటీ రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు అధికంగా పెరగడంతో రహదారి వెడల్పు తగ్గిపోవడం, వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించి ఈ చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని పోలీసులకు సహకారం అందించారు.
ఈ సందర్భంగా మందమర్రి ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ
“మందమర్రి ఆవడం చిర్రకుంట బీటీ రోడ్డులో ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను ప్రజల సహాయంతో తొలగించడం జరిగింది. దీనివల్ల రోడ్డుకు పూర్తి వెడల్పు అందుబాటులోకి వచ్చి, రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకరించిన సారంగపల్లి, చిర్రకుంట గ్రామ ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
ఎస్సై సూచించిన ముఖ్య భద్రతా నియమాలు:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ఉపయోగించాలి
నిర్ణీత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి
మద్యం సేవించి వాహనం నడపడం నేరం అలా చేయవద్దు
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ పత్రాలు ఎల్లప్పుడూ వెంట ఉంచాలి
మలుపులు, దృష్టి గోచరత తక్కువ ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లాలి
మందమర్రి పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్సై రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు.
