భూసేకరణ పనుల వేగవంతం చేయాలి
◆:- జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , రెవెన్యూ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనుల వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ,రెవెన్యూ అధికారులను ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్ ( ఆర్ఆర్ఆర్ ),రోడ్ ఓవర్ బ్రిడ్జీలు ( ఆర్ఓబిఎస్ ) నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ( నిమ్స్ ) కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు .ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో ప్రజల న్యాయమైన హక్కులు కాపాడబడేలా, రైతులకు న్యాయం జరుగేలా, అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పెద్దాపూర్, గిర్మాపూర్ శివాంపేట్ మండలాల్లో భూసేకరణ సమస్యలపై సవివర చర్చ జరిపి,వాటికి సాధ్యమైన పరిష్కారాలను సూచించారు.ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ విషయమై భూముల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు . భూసేకరణలో న్యాయం జరిగేలా విక్రయ విలువలను ఆధారంగా పరిగణించాల్సిందిగా పేర్కొన్నారు .అదేవిధంగా,జహీరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్స్) కు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఎన్ఐసిడిసి ) తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ( టి జి ఐ ఐ సి )ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ( ఎంఓయు ) మేరకు, నిమ్స్ లో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయబడనున్నది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూముల సేకరణపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి,రెవెన్యూ అధికారులు ,నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
