నాట్స్ సంబరాలు ప్రారంభం…

టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల వద్ద ప్రవాసాంధ్రుల సందడి ఒకవైపు, సాయంకాలం జోరువాన మరో వైపు వెరసి.. టాంపా తెలుగుదనంలో తడిసి పరవిశించింది.

వేదిక ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నర్తనశాల పేరుతో దిగువ భాగాన్ని, రంగస్థలం పేరుతో పైభాగాన్ని ఈ వేడుకల నిర్వహణ కోసం నామకరణం చేశారు. రంగస్థల వేదికపై బ్యాంక్వెట్ విందు నిర్వహించారు.

సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేశారు. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ప్రారంభమైన నాట్స్ నేడు అమెరికాలో తెలుగు సంఘాల సేవా కార్యక్రమాల్లోనే కాకుండా మహాసభల నిర్వహణలో సరికొత్త రికార్డు నెలకొల్పిందని, వేడుకలు విజయవంతం చేయడంలో తనకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ టాంపా అనే ఊరు పేరును ఇకపై నది, అమెరికా సంస్కృతి అని కాకుండా.. నాట్స్ సంబరాలు జరిగిన నగరంగా గుర్తుంచుకుంటారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆయన స్వాగతం పలికారు.

ఈ వేడుకలకు ఫ్లోరిడా రాష్ట్ర సెనేటర్ జయ్ కాలిన్స్, అట్లాంటా కాన్సుల్ జనరల్ రమేష్ లక్ష్మణన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన జులై 4వ తేదీన ప్రవాస భారతీయ సంఘమైన నాట్స్ సంబరాల్లో పాల్గొనడం అమెరికాలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. డా. దేవయ్య, రుద్రమ్మ పగిడిపాటి దంపతులకు విశేష సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు. రచయితలు కళ్యాణ్ చక్రవర్తిని అధ్యక్షుడు మందాడి శ్రీహరి, రామజోగయ్య శాస్త్రిని మాజీ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బుల్లితెర నటీనటుల హాస్యవల్లరి అలరించింది.

సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తారలు జయసుధ, రజిత, సుధీర్‌బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని, మెహెర్ రమేష్, థమన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ అతిథుల వద్దకు వెళ్లి వారితో ఫోటోలు దిగి మరీ సభా ప్రాంగణమంతా సందడి చేశారు.

ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, నాదెండ్ల మనోహర్‌లతో పాటు మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, కావలి గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి మీనా, జయసుధ, నటుడు సాయికుమార్ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. బ్యాంక్వెట్‌కు చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ సంగీత విభావరితో ముగింపు పలికారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version