కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ రాజీనామా..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-29T144546.470.wav?_=1

 

కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ రాజీనామా..! కాంట్రాక్ట్ ఉద్యోగుల సంబరాలు

 

కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో అవకతవకల సంచలనం—పారదర్శక విచారణ కోరుతున్న విద్యార్థులు.

అక్రమ మార్కుల కుంభకోణం? కనిపించని పీఏకి జీతాలు? నందకుమార్ పాత్ర ఏంటి?

వైస్ ఛాన్సలర్ నందకుమార్ అక్రమాలు? విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అనేక దందాలు వెలుగులోకి— రాజీనామా చేసిన “విసి” పై కొత్త సందేహాలు?

నేటిధాత్రి, వరంగల్.

కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో అక్రమ మార్కుల దందాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పారదర్శక విచారణకు డిమాండ్ చేస్తోన్న విద్యార్థి సంఘాలు. వివరాల్లోకి వెళితే వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. విద్యార్థులకు అక్రమమార్గంలో మార్కులు కేటాయించడం, దీనివల్ల మిగతా విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ నందకుమార్ రెడ్డికి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నట్టు, ఆ వ్యక్తి ఎప్పుడూ డ్యూటీలో కనిపించకపోయినా నెలకు రూ.90 వేలకు పైగా జీతం తీసుకున్నట్టు వార్తల సమాచారమే మరింత సంచలనంగా మారింది.

పీఏ ఎక్కడ ఉన్నాడు? పని చేయకుండానే ఎలా జీతం చెల్లించారు? అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలు బహిర్గతం కావడానికి ముందే నందకుమార్ రెడ్డి రాజీనామా చేయడం, ఆ తరువాత శనివారం తిరిగి యూనివర్సిటీకి రావడంపై ఉద్యోగుల్లో అనుమానాలను రేకెత్తించింది. రాజీనామా చేసిన వ్యక్తి శనివారం యూనివర్సిటీకి తిరిగి వచ్చి ఏమి తీసుకెళ్లారు? రాజీనామా చేసిన 24 గంటల్లోపు తిరిగి వచ్చి కొన్ని ఫైల్స్ తీసుకెళ్లినట్లు అనేక సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని ఆరా తీశాయి. యూనివర్సిటీలో జరిగిన అనుమానాస్పద వ్యవహారాలపై పారదర్శకమైన విచారణ జరిపించి నిజాలను బయటకు తీసుకురావాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం సీజ్—రీవాల్యూయేషన్‌పై ఆరోపణల నేపథ్యంలో కీలక చర్య

వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య రీవాల్యూయేషన్‌పై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాన్ని సీజ్ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య పర్యవేక్షణలో, స్థానిక ఎమ్మార్వో సమక్షంలో జవాబు పత్రాలను, స్కాన్ చేసిన కంప్యూటర్లు, సంబంధిత పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రీవాల్యూయేషన్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న అనుమానాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలోనే ఈ సీజ్ చర్యలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూనివర్సిటీలో మార్కుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, కనిపించని పీఏ జీతం వివాదం, రీవాల్యూయేషన్‌లో అక్రమ మార్పుల ఆరోపణలతో ఇప్పటికే పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల విభాగాన్ని సీజ్ చేయడం వల్ల రీవాల్యూయేషన్ డేటా, కంప్యూటర్ రికార్డులు, స్కాన్ చేసిన జవాబు పత్రాలు వంటి కీలక ఆధారాలు ప్రభుత్వ విచారణకు అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజనిజాలు బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

కాలోజీ హెల్త్ యూనివర్సిటీ రీవాల్యూయేషన్ వ్యవహారంపై విజిలెన్స్ తనిఖీలు

యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి వివరణ

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో రీవాల్యూయేషన్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ శాఖ విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టింది. విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగు రోజుల క్రితం యూనివర్సిటీలో కీలక విభాగాల్లో పరిశీలనలు నిర్వహించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి తెలిపారు.

రిజిస్ట్రార్ వివరించిన ప్రకారం, అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు మెడికల్ పీజీ ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 2123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 1918 మంది ఉత్తీర్ణులు, 205 మంది విద్యార్థులు అనుతీర్ణులు అయ్యారని వివరించారు. ఫలితాలు నవంబర్ 4న విడుదల చేసిన వెంటనే, 155 మంది విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో నలుగురు పీజీ విద్యార్థుల రీవాల్యూయేషన్‌కు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం కావడంతో విజిలెన్స్ శాఖ యూనివర్సిటీని సందర్శించి రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ, రీవాల్యూయేషన్ ప్రక్రియలో పారదర్శకతకు యూనివర్సిటీ కట్టుబడి ఉందని, అవసరమైన సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు అందజేశామని రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.

ఆరోపణలపై మాజీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ నందకుమార్ రెడ్డి వివరణ

కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీలో ఇటీవల వెలుగులోకి వస్తున్న ఆరోపణలపై మాజీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ నందకుమార్ రెడ్డి స్పందించారు. కామినేని ఆసుపత్రిలోని ఒక పీజీ విద్యార్థిని అర్జీ మేరకు మాత్రమే రీవాల్యూయేషన్‌ జరిపించానని, తాను ఎలాంటి అక్రమం చేయలేదని స్పష్టం చేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నందున ప్రభుత్వం మరియు యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే రెండు రోజుల క్రితమే రాజీనామా సమర్పించానని అన్నారు. “నాపై ఎలాంటి విచారణ జరిగినా నేను సిద్ధంగా ఉన్నాను” అని నందకుమార్ రెడ్డి పేర్కొన్నారు. “సుపరిపాలన అందించిన రాముడి అంతటి వాడికే నిందలు తప్పలేదు… నేను వచ్చిన మరుసటి రోజు నుంచే దుష్ప్రచారం మొదలైంది. ఆరు నెలలు కూడా పనిచేయలేడని, త్వరలో కొత్త వీసీ వస్తాడని పుకార్లు పుట్టించారు” అని వ్యాఖ్యానించారు. ఇక యూనివర్సిటీ పరువు ప్రతిష్ట కోసం తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని పేర్కొన్నారు.

వరంగల్ కాళోజి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంబరాలు

కాళోజి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు విశేష ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి తన పదవీ నుండి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉద్యోగులలో హర్షం మరియు ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాంబులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్యోగులు రాజీనామా ప్రకటణను స్వాగతిస్తూ, సంబరాలను ఘనంగా జరిపారు.

వరంగల్‌లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పీజీ పరీక్షల రీవాల్యూయేషన్‌పై వచ్చిన ఆరోపణలు పెద్ద సంచలనం సృష్టించాయి. మాజీ వైస్‌ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి రాజీనామా చేయడం కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆనందాలను రేకెత్తించింది. మరోవైపు ఆయన ఎలాంటి అక్రమం చేయలేదని, అన్ని విచారణలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version