శివాని స్కూల్‌లో ఘనంగా కబడ్డీ పోటీలు
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మండలం మహేశ్వరంలోని శివాని పబ్లిక్ స్కూల్‌లో బుధవారం కబడ్డీ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు.వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్, గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. శివాని పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కబడ్డీ టోర్నీ నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడారంగ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు.పోటీల్లో స్టేడియం నర్సంపేట, శివాని పబ్లిక్ స్కూల్, మేడపల్లి, అశోక్ నగర్ గ్రామాల నుంచి కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో శివాని పబ్లిక్ స్కూల్ జట్టు ప్రథమ స్థానం, స్టేడియం నర్సంపేట జట్టు ద్వితీయ స్థానం సాధించాయి.కార్యక్రమంలో నర్సంపేట స్టేడియం ఇన్‌చార్జి, కబడ్డీ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు ఉరుసుల శేఖర్ యాదవ్, వజ్జ రాజేష్, ఓరుగంటి మహేష్, పుల్లూరి సుమన్‌గౌడ్, కుంట విజేందర్ యాదవ్, శివాని స్కూల్ పీఈటీలు రాజు, మురళి పాల్గొన్నారు.
