న్యాయం కావాలి.!

న్యాయం కావాలి

‘బంధన్’ బాధితుడు కృష్ణ

⏩ ‘ఎంజీఎం’ నిపుణుల నివేదిక కోసం బాధితుడి ఎదురుచూపులు
⏩‘బంధన్’ ఘటనపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చేదెప్పుడు?
⏩8 నెలలు దాటుతున్నా ఫిర్యాదుపై కనీస పట్టింపు లేదు
⏩ఐఎంఏ సమక్షంలో తప్పు ఒప్పుకున్న సదరు ఆస్పత్రి వైద్యులు!
⏩ఆ నివేదిక ఆధారంగానే చర్యలు అంటున్న డీఎంహెచ్‌వో!

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

 

 

తనకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని ‘బంధన్’ హాస్పిటల్ బాధితుడు కృష్ణ వేడుకుంటున్నారు.గత ఏడాది ‘బంధన్’ఆస్పత్రిలో తనకు అన్యాయం జరిగిందని,పలు విభాగాల అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్జరీ,పోస్ట్ ఆఫ్ కేర్‌లో ‘బంధన్’లో జరిగిన క్షమించరాని నిర్లక్ష్యంతో తాను జీవితపు చరమాంకానికి వెళ్లి బయటపడ్డానని వెల్లడించారు.

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసుల కాంక్షతో, వ్యాపార దృక్పథంతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు కంప్లయింట్ చేసి 8 నెలలు దాటుతున్నా కనీస పట్టింపు లేకపోవడం సరికాదని,ఈ లెక్కన వ్యవస్థలో సామాన్యులకు న్యాయం అందడం,తప్పు చేసిన వారి పైన చర్యలు అంతంత మాత్రమే అనే భావన ఏర్పడుతోందని పేర్కొన్నారు.

పూర్తి వివరాలతో బాధితుడు కృష్ణ తెలిపిన ప్రకారం బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది జూలై 21న అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కృష్ణకు అదే రోజు సాయంత్రం 6 గంటలకు 4 గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.

ఈ క్రమంలో పెద్ద పేగుకు రంధ్రం పడటంతో రోగి శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ అయి పరిస్థితి విషమించింది.

ఒకరోజు తర్వాత అది గ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యులను అడగగా ఎవరూ స్పందించకపోవడంతో ఆపరేషన్ వికటించిందని భావించి జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్‌కు తీసువెళ్లారు.

అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.దాంతో ఆ రాత్రే బేగంపేట మెడికవర్ హాస్పటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యారు.

 

⏩పెద్దలతో ‘బంధన్’కు బంధాలు..!

 

 

మెడికవర్ ఆస్పత్రికి చేరుకునే సరికి రోగి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది.

 

మరో 6గంటలు ఆలస్యం అయితే ప్రాణానికి ప్రమాదమని అక్కడి సీనియర్ వైద్యులు తెలిపారు.

అక్కడ ట్రీట్‌మెంట్ అనంతరం బాధితుడు కృష్ణ తన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత బంధన్ హాస్పిటల్‌కి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై నిలదీశాడు.

దానికి వైద్యులు నిర్లక్ష్యమైన సమాధానాన్నిస్తూ తమ వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని, హాస్పటల్ రాజకీయ నాయకులదేనని బెదిరిస్తూ వస్తున్నారు.

 

‘మా బంధన్’ హాస్పిటల్ ఓపెన్ చేసింది కూడా ఓ మంత్రినే’అని తెలుసుకోవాలని బెదిరించినట్టు బాధితుడు ఆరోపించాడు.

 

తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు ఆధారాలతో హన్మకొండ డీఎంహెచ్‌వోకు,ఐఎంఏ వాళ్లకు ఫిర్యాదు చేశాడు.

 

ఐఎంఏ పెద్దల ముందు తాము బాధితుడు కృష్ణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించామంటూ ఒప్పుకున్నారు.

 

కానీ, ఆ హాస్పిటల్ మీద వైద్యులపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూ ఐఎంఏ డాక్టర్లు స్పష్టం చేశారు.

 

 

⏩రిపోర్ట్‌కు ఇంకెంత టైం కావాలో?

 

 

అనంతరం బాధితుడు డీఎంహెచ్‌వోను గతేడాది నవంబర్‌లో సంప్రదించగా..

 

16 డిసెంబర్ 2024న వరంగల్ ఎంజీఎం
సూపరింటెండెంట్‌కు ఎక్స్‌పర్ట్స్(నిపుణుల) కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు.

కానీ ఎంజీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక రాకపోవడంతో బంధన్ హాస్పిటల్‌పై, వారి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు తెలుపుతున్నారని బాధితుడు కృష్ణ వెల్లడించారు.

 

ఈ ఏడాది కాలంలో బంధన్ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు రెండు,మూడు జరిగాయని, అందులో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందారని కృష్ణ వివరించారు.

 

ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఎంక్వయిరీ పూర్తి చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version