జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాల అమ్మకాలు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండి పాటు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్లాంట్ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఆరోపించారు.పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులు నేడు తీవ్ర ఆవేదన చెందుతున్నారని,వారికి ఇచ్చిన హామీలను యాజమాన్యం గాలికి వదిలేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి,ఇప్పుడు వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు.కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి,వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు.స్థానిక యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కాంగ్రెస్ నాయకులు దూర ప్రాంతాల వారికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయన సంచలన విమర్శలు చేశారు.భూములిచ్చిన నిర్వాసితులకు,స్థానిక నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని డిమాండ్ చేశారు.ప్రభావిత గ్రామాల యువతకు న్యాయం జరగని పక్షంలో,బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని,నిర్వాసితుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బాల్క సుమన్ హెచ్చరించారు.
