దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయంపై ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు.
లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచులో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పీఎం షరీఫ్(Shehbaz Sharif) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమ్ పాకిస్థాన్‌కు అభినందనలు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి కృషి అమోఘం. దేశం గర్వించదగ్గ క్షణం ఇది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై ఆకాశ్ చోప్రా వెటకారంగా స్పందించాడు. ‘గౌరవంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇది ఆస్ట్రేలియా బి టీమ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే. ఆసీస్ జట్టులోని కీలక ప్లేయర్లు ఎవరూ ఈ జట్టులో లేరు. 170 పరుగుల మ్యాచులో కేవలం 20 పరుగుల తేడాతో గెలవడాన్ని ‘అద్భుతమైన ప్రదర్శన’ అని పిలవలేం’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
