ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్
ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నౌకాదళం భారత పోర్టులను వినియోగిస్తున్నదన్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు నిరాధారం, కల్పితమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్ర విదేశాంగ శాఖ(MEA) స్పష్టం చేసింది.
అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఒత్తిడి పెరగడంతో మా నావల్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలూ ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భారత్, ఆ దేశానికి చెందిన నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన మార్గం కాదు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణంగా అలా చేయక తప్పడం లేదు’ అని మాక్‌గ్రెగర్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. ‘భారత పోర్టులు అమెరికా దాడులకు ఉపయోగిస్తున్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. నిర్ధారణ లేని సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది.
