కేతకిలో….. ఇష్టరాజ్యం….!
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ పరిధిలోని శ్రీ కేతకీ సంగమేశ్వర దేవాలయం ఝారాసంగం లో ఇటీవల జరిగిన అవ్యవస్థలు భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. నవంబర్ 16, 2025న ఆలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులు నిర్వాహకుల నిర్లక్ష్యం, అనుచిత వ్యవహారం, నియమ నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆలయంలో జరుగుతున్న అభిషేక కార్యక్రమానికి అనుమతి లేని వ్యక్తులను లోపలికి అనుమతించడం, భక్తులను బయట వేచి ఉండేలా చేసి అసౌకర్యానికి గురిచేయడం, గర్భగుడి వద్ద అనవసర రద్దీ నెలకొనడం వంటి అంశాలు బయటపడ్డాయి. విఐపి దర్శనాల పేరుతో సాధారణ భక్తులను నిర్లక్ష్యం చేయడం పట్ల కూడా భక్తుల్లో ఆగ్రహం చెలరేగింది.ఈ మొత్తం వ్యవహారంపై 126వ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ అధికారికంగా దేవాదాయ శాఖకు ఫిర్యాదు అందజేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఏవీ భరించబోమని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఆలయ నిర్వహణ జరగడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
◆ రుద్ర అశోక్ ఫిర్యాదులో—
◆ అభిషేక సమయాల్లో నియమాలు పాటించకపోవడం,
◆ గర్భగుడి వద్ద అనుచిత రద్దీ,
◆ అధికారుల పర్యవేక్షణ లోపం,
◆ భక్తులకు అగౌరవం,
◆ వంటి అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు.
ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యత ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ మర్యాదలను కాపాడడం దేవాదాయ శాఖ ప్రధాన బాధ్యత అని రుద్ర అశోక్ స్పష్టం చేశారు.
భక్తులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దేవాలయ నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు,
