’’బీఆర్‌ఎస్‌’’ కలిసి రాదు..’’టీఆర్‌ఎస్‌’’కు తిరుగులేదు!

`పేరులో ఏముందనుకోకండి?

`ఇంకా మొండి తనం పనికి రాదు.

`పెళ్ళికి కూడా పేరు బలం చూస్తారు.

`’’టీఆర్‌ఎస్‌’’ లో విజయాలు జయకేతనం చూశాయి.

`‘‘బీఆర్‌ఎస్‌’’ లో పరాజయాలు పకపక నువ్వుతున్నాయి.

`పదే పదే అపజయాలు పరిహాసమాడుతున్నాయి.

`అంతా నాకే తెలుసు అనుకుంటే ఇలాగే వుంటుంది.

`’’టీఆర్‌ఎస్‌’’ లో తెలంగాణ ఆత్మ వుంది!

`’’టీఆర్‌ఎస్‌’’ లో తెలంగాణ ఆత్మగౌరవం వుంది.

`’’టీఆర్‌ఎస్‌’’ లో పోరాటం వుంది.

`తెలంగాణ కోసం తెగింపు వుంది.

`తెలంగాణ పోరాట పటిమ వుంది.

`తెలంగాణ సాధించిన ఘనత వుంది.

`’’టీఆర్‌ఎస్‌’’ లో తెలంగాణ ఆవిష్కారముంది.

`బంగారు తెలంగాణ చేసిన చరిత్ర వుంది.

`’’బీఆర్‌ఎస్‌’’ లో అదేమి కనిపించడం లేదు.

`వరుస ఓటములు తప్ప మిగిలిందేమీ లేదు.

`పార్టీలో లుకలుకలు తప్ప సాధించిందేమీ లేదు.

`పార్టీ నాయకులంతా ‘‘టీఆర్‌ఎస్‌’’ కోరుకుంటున్నారు.

`సాంకేతిక సమస్యల పేరు చెప్పుకుంటూ పోతే నిండా మునుగొచ్చు!

`తెలంగాణలో కూడా ఉనికి లేకుండా పోవచ్చు!

`మొదటికే మెసం రావచ్చు!

`కోరికోరి ఇంకా కొరివితో తల గోక్కోవద్దు.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                        

ఒక్క ఓటమి అనేక విజయాలకు పునాది కావొచ్చు. ఒక్క గెలుపు వరుస విజయాలకు బాట కావొచ్చు. ఆ పార్టీ రాజకీయాలకు మలుపుకావొచ్చు. రాజకీయాల్లో ఇదే నిజం కావొచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం అనేది పాత మాట. కేంద్రంలో బిజేపిని చూసిన తర్వాత ఆ మాట మార్చుకోవాల్సిందే. అందుకు బిజేపి రాజకీయాలు సాక్ష్యంగా తీసుకోవచ్చు. కేంద్రంలో వరుస ఓటమలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పరిస్దితి రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలకు రావొద్దు. ముఖ్యంగా తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీకి అసలే రావొద్దు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అనేది ఇప్పుడు పేరు మార్చుకున్నప్పటికీ ఉద్యమ పార్టీ అనే ముద్ర దానిపై వుంది. కాని బలంగా లేదు. ఉద్యమ పార్టీ అనే ముద్రలు చేజేతులా ఆ పార్టీ అదినేత కేసిఆర్‌ చేరిపేసుకున్నట్లైంది. టిఆర్‌ఎస్‌ నుంచి పార్టీ పేరు బిఆర్‌ఎస్‌కు మార్చడంతోనే పతనం మొదలైంది. ఆనాడు పార్టీలో ఏ నాయకుడు పేరు మార్పు కోరలేదు. నిజం చెప్పాలంటే కనీసం సూచించలేదు. దక్షిణాది నుంచి జాతీయ పార్టీ వుండొద్దా? అనే ఆలోచనతో కేసిఆర్‌ చేసిన ప్రతిపాదన మాత్రమే. జాతీయ స్దాయిలో చక్రం తిప్పేందుకు వేసిన ఎత్తుగడ మాత్రమే. కాని జాతీయ స్దాయిలో కీలక భూమిక పోషించాలన్న ఆలోచనతో ఉత్తరాదిలోనే ప్రస్దానం మొదలు పెట్టిన బహుజన సమాజ్‌ పార్టీ సొంత రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. చీలికలు పీలికలైపోయింది. జాతీయ పార్టీల రాజకీయాలను తట్టుకోలేకపోతోంది. రాజకీయాల్లోకి ఉవ్వెత్తున వచ్చిన ఆప్‌ లాంటి పార్టీ కూడాడిల్లీలో ఓటమిని మూట గట్టుకున్నది. జాతీయ స్దాయిలో ఎదగాలనుకొని, సొంత రాష్ట్రం డిల్లీలో చతికిలపడిపోయింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్‌ ఇమేజ్‌ యమునా నదిలో కలిసిపోయింది. నడుస్తున్న రాజకీయాలను చూస్తూ అడులేయడం నేర్చుకోకపోతే పరిస్దితి చే జారిపోతుంది. కమలం వికాసానికి దారులు తెరిచినట్లౌవుంది. తెలంగాణలో ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ తేరుకోకపోతే భవిష్యత్తు మరింత అందకారమౌతుంది. చెప్పుడు మాటలో, లేక అధినేత ఆలోచనలో గాని వాస్తవంలో వుండాలి. నేల విడిచి సాము చేసేలా వుండకూడదు. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ అనే పేరు నుంచి బిఆర్‌ఎస్‌అనే పేరు మార్పునాడే పతనానికి రెడ్‌ కార్పెట్‌ పరుచుకున్నట్లైంది. పదేళ్లపాటు కేసిఆర్‌పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. కాని వాటిని ప్రచారం చేసుకోవడానికి ఆంద్రా మీడియానే నమ్ముకొని కేసిఆర్‌ నిండా మునిగారు. ఇప్పటికీ అదే మీడియాను నమ్ముకొని కేసిఆర్‌, కేటిఆర్‌, హరీష్‌రావులు రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులు తలగలబెట్టిన ఆంధ్ర జ్యోతి పత్రికనే కేసిఆర్‌ నెత్తిన పెట్టుకుంటూ వచ్చారు. ఆ పత్రిక కార్యాలయం అగ్నికి ఆహుతి కాగానే కొంపలు ముగినిపోయినట్లు కేసిఆర్‌ వెళ్లి కార్యాలయం పరిశీలించారు. ఆ పత్రిక అధినేత రాధాకృష్ణకు ధైర్యం కల్పించారు. కాని ఆ పత్రిక బిఆర్‌ఎస్‌ మీద విషం చిప్పడం ఏనాడు ఆపలేదు. బిఆర్‌ఎస్‌ పతనం చూసే దాక నిద్రపోలేదు. అలాంటి వారిని నమ్ముకొని రాజకీయాలు చేయడమే కాదు, ప్రభుత్వ ధనాన్ని ప్రకటనల రూపంలో దార పోశారు. ఆంద్రా మీడియాను బతికించారు. ఆంద్రా మీడియాకు విశ్వాసంవుండదన్న సంగతి తెలిసినా ఇప్పటికీ ఆ మీడియాకే పల్లకి మోస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న ఆలోచనలు చేసిన నాడు తెలంగాణ సమాజమంతా ఆ ప్రయత్నం వద్దని వారించింది. ఎంతో మంది మేధావులు కూడా వద్దని చెప్పారు. కాని ఆంద్రామీడియా మాత్రం అహో..ఓహో అని రెచ్చగొట్టారు. అప్పుడు ఆంద్రా మీడియా చాలా గొప్పగా కనిపించింది. లోన టిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ స్దాయికి ఎదగడం సుతారం ఆంద్రా మీడియాకు ఇష్టం వుండదు. తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేని ఆంద్రా మీడియా బిఆర్‌ఎస్‌గా మారితే ఎలా సపోర్టు చేస్తుందని అనుకున్నారో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఏ ఆంధ్రజ్యోతికి పెద్ద పీట వేసి వెనకేసుకొచ్చారో…అదే పత్రిక రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడైన నాటి నుంచి బిఆర్‌ఎస్‌ మీద విషం చిమ్ముతూనే వచ్చారు. రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఓ హోటల్‌లో జరిగిన సమావేశానికి ఆంద్రామీడియా అంతా వెళ్లారు. అప్పటి నుంచి కేసిఆర్‌ ఓడిపోయే దాకా అసత్యాలు రాస్తూనే వచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మునిగిపోయింది లేదు. టిఆర్‌ఎస్‌ పేరులో వున్న బలం బిఆర్‌ఎస్‌లో లేదు. భవిష్యత్తులో మళ్లీ పార్టీ గెలవాలన్నా, మళ్లీ కేసిఆర్‌ సిఎం. కావాలన్న పార్టీ పేరు మార్పు జరిగితే తప్ప తెలంగాణ ఆత్మ కలిసి రాదు. కేసిఆర్‌ తర్వాత కూడా పార్టీ నిలబడాలి కేటిఆర్‌ సిఎం. కావాలి అంటే కూడా టిఆర్‌ఎస్‌గా మార్పు చెందాలి. ఇంకా పార్టీ అధినేత కేసిఆర్‌కు మొండితనం పనికిరాదు. పార్టీలో ఈ చర్చ పెడితే నూటికి 99శాతం మంది కూడా మళ్లీ టిఆర్‌ఎస్‌ పేరు కావాలనే కోరుకుంటారు. పార్టీ తెలంగాణలోనైనా బతడం ముఖ్యమా? లేక మొత్తనికే మునగడం అవసరమా? అనేది కేసిఆర్‌ తేల్చుకోవాలి. పెళ్లికి కూడా పేరు బలం చూస్తారు. పుట్టిన నక్షత్రం ఆదారంగానే పేరు పెట్టాలంటారు. ఇది తెలియనంత అమాయకుడు కాదు కేసిఆర్‌. అయినా తప్పటడుగు పడిరది. దానిని దిద్దుకునే అవకాశం వుంది. కేసిఆర్‌ అంటే తెలంగాణ ఆత్మ. తెలంగాణ కష్టం చూసి రాష్ట్రం కోసం పోరాటం చేశారు. బిజేపి అఖంఢభారత్‌ నినాదం ఎలాంటిదో..కేసిఆర్‌ బిఆర్‌ఎస్‌ పేరు కూడా అంతే.! ఎందుకంటే నిత్యం ముస్లిం పేరు చెప్పి రాజకీయం చేసే బిజేపి అఖండ బారత్‌ నిర్మాణం అనేది ఒక మిద్య. అది సాద్యమయ్యేది కాదు. సాద్యమైతే హిందూ మతానికే ప్రమాదమని వారికి తెలుసు. పాకిస్తాన్‌లోవున్న 25కోట్లు, బంగాదేశ్‌లోవున్న 15 కోట్లు, మన దేశంలో వున్న 45 కోట్ల మంది ముస్లింలు కలిస్తే అధికారం హిందువుల చేతుల్లో నుంచి పోతుంది. ఈ సంగతి తెలిసినా అఖంఢ బారత్‌ అని బిజేపి నినదిస్తుంది. కాని ఆచరణలోవుండదు. కేసిఆర్‌ కూడా బిఆర్‌ఎస్‌ వల్ల కోలుకోమని తెలిసనా పేరు మార్చారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు దేశ రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఫలితం లేదు. ఎందుకంటే అఖండ భారత్‌లో హిందూ ఆత్మ వుండదని బిజేపి గ్రహించింది. అందుకే వరుసగా విజయాలు సాదిస్తోంది. మెజార్టీ హిందువుల ఓట్లతో అప్రతిహాతంగా గెలుస్తూ వస్తోంది. కేసిఆర్‌ చేయాల్సిన పని కూడా అదే. ఇప్పటికైనా సరే బిఆర్‌ఎస్‌ పేరును వెంటనే టిఆర్‌ఎస్‌గా మార్చుకోవాలి. అందుకు సాంకేతిక సమస్యలనే సాకు చెప్పుకుంటూ పోతే మరింత నష్టపోకతప్పదు. పార్టీకి బిఆర్‌ఎస్‌ పేరు సమస్యే కాదనుకుంటూ కాలయాపన చేసే పార్టీ కూడా మిగలకపోవచ్చు. ఒకవేళ పది మంది ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలవపోతే ఏం జరుగుతుందో కేసిఆర్‌కు తెలుసు. ఇప్పుడు ఏ కేసిఆర్‌ను చూస్తూ జాతి పిత అని కొలుస్తున్నారో వాళ్లే తిట్టే రోజులు వస్తాయి. కాలమహిమ అంటే అదే. అంత దూరం తెచ్చుకోవద్దు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ లేదు. భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. టిఆర్‌ఎస్‌ పేరుతో అనేక విజయాలు సొంతమయ్యాయి. అపజయాలు తొలుత పలకరించినా అవి మళ్లీ విజయాలుగా మారాయి. బిఆర్‌ఎస్‌ పేరు మార్చిన నుంచి వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. పార్టీని చూసి పకపక నవ్వుకుంటున్నాయి. పదే పదే పరాజయాలు బిఆర్‌ఎస్‌ను పరిహాసమాడుతున్నాయి. తెలంగాణలో ఎంతో మంది కేసిఆర్‌ శ్రేయోభిషులు ఇప్పటికీ సూచిస్తున్నారు. పేరు మార్చండని కోరుతున్నారు. అయినా మేం వినం అనుకుంటూ కూర్చుంటే చేసేదేమీ లేదు. బిఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత వరుస ఓటములు తప్ప విజయాలు లేవు. పార్టీలో లుకలుకలు తప్ప ఐక్యత కనిపించడం లేదు. ఆఖరుకు ఎమ్మెల్సీ కవిత కూడా బైటకు వెళ్లాల్సిన పరిస్దితి ఎదురైంది. పార్టీ కష్ట కాలంలోకి నెట్టి వేయబడిరది. ఇంకా కాలయాపన చేయొద్దు. నాయకుల అభిప్రాయాలు తీసుకోండి. జనం కూడా ఏమనుకుంటున్నారో మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టండి. ఆంద్రా మీడియా ముసుగును తొలగించుకోండి. ఆంద్రా మీడియా ఎప్పుడూ తెలంగాణకు శత్రువే. టిఆర్‌ఎస్‌ ఆంద్రామీడియా ఆట కట్టించింది. బిఆర్‌ఎస్‌ ఆంద్రామీడియ ఆటలను చూస్తూ వుండిపోతోంది. ఇంతకన్నా సాక్ష్యం మరొకటి అవసరం లేదు. మార్పుకు ఇంకా శషబిషలు అక్కర్లేదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version