జోరుగా అక్రమ ఇసుక రవాణా
చోద్యం చూస్తూన్న అధికారులు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే వాగు ద్వారా అనుమతి లేకుండా సమయపాలన లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఆసరాగా చేసుకొని శివారు ప్రాంతమైన గోపాలరావుపేట గ్రామంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి పక్కనే ఉన్న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు అక్రమ ఇసుకను మినీ లారీ ద్వారా రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాకు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని ప్రజలలో ఒకింత అసహనానికి గురవుతున్నారు. అక్రమ దందా వల్ల రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు
. రామడుగు మండల మోతే వాగు పరిసర గ్రామాలైన మోతే, కొరటపల్లి, కోక్కెరకుంట, రామడుగు తదితల గ్రామాల ద్వారా ఇసుక బకాసురులు అక్రమంగా వాగులోని ఇసుకను తొలగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి నిలువలు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న గోపాలరావుపేట గ్రామంలో ట్రాక్టర్ల ద్వారా గ్రామ శివారు ప్రాంతాలలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఇసుక డంపింగ్ చేసి వాటిని మినీ లారీ (టిఎస్02యూడి2215) ద్వారా ఇతర జిల్లాలకు గత మూడు సంవత్సరాలకు పైగా తరలిస్తున్న విషయం స్థానిక గ్రామపంచాయతీ, పోలీస్ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడిన వాహనాలను రెవెన్యూ అధికారులకు అప్పగించిన తూతూ మంత్ర జరిమానాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతున్నట్లు వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులు, మండలంలోని ప్రజలు అధికారులపై బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం, పరిసరాల వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఎదురవుతున్నాయని, ఈపరిస్థితుల్లో అధికారులు ఇప్పటికీ చోద్యం చూస్తూ ఉండటం అక్రమార్కులకు లబ్ది చేకూర్చుతోందని, సమగ్ర, నిరంతర చర్యలు తీసుకోకపోతే ఇసుక మాఫియా మరింత చెలరేగే ప్రమాదం ఉందని అధికారులు ప్రత్యేకమైన, కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు మేల్కొని పటిష్టమైన చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చిన ట్రాక్టర్లను మాత్రమే ఆయా గ్రామాలలోకి ఇచ్చిన సమయంలోనే ఇసుక రవాణా చేయాలని, అనుమతిలేని ట్రాక్టర్లను పెట్టుకొని అట్టి వాహనాలను సీజ్ చేయడంతో పాటు ప్రకృతి సంపదన కాపాడి, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు
