సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

 

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..

 సంక్రాంతి (Sankranti) పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఈ ఏడాది కూడా అదే దృశ్యం పునరావృతమవుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గడిచిన మూడు రోజుల్లోనే నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు.

బస్టాండ్ల వద్ద భారీ రద్దీ..

భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయినప్పటికీ.. సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్టాండ్లలో కిక్కిరిసిన ప్రయాణికులు..

స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. టిక్కెట్లు దొరక్క, బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన వారైతే.. మరిన్ని తీవ్ర అవస్థలు పడుతున్నారు.

రైళ్లు, బస్సుల్లో ‘నో వేకెన్సీ’..

ప్రయాణికుల డిమాండ్ భారీగా పెరగడంతో రేపటి వరకు బస్సులు, రైళ్లలో అన్ని రిజర్వేషన్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. ఆన్‌లైన్, కౌంటర్ రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అవి సరిపోవడం లేదు. రేపటి వరకు అన్ని ప్రధాన రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి.

సమయానికి రాని బస్సులు..

సమయానికి బస్సులు రాకపోవడం ప్రయాణికుల సమస్యలను మరింత పెంచుతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవకపోవడంతో బస్టాండ్లలో గందరగోళం నెలకొంది. కొన్నిచోట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు.

అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి..

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..

రిజర్వేషన్లు దొరక్కపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని.. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాహనాల్లో సీట్లు దొరకని ప్రయాణికులు చేసేదేమీ లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు.. సాధారణ చార్జీల కంటే మూడు రెట్లు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

 

ట్రాఫిక్‌తో నరకం..

హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే పంతంగి టోల్ ప్లాజా, వరంగల్ వైపు వెళ్లే రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

మూడు రోజుల్లో 30 లక్షల మందికి పైగా..

అధికారిక లెక్కల ప్రకారం, గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్ నగరం నుంచి 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తరలివెళ్లినట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version