చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు
వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Chittoor Rains) కురుస్తున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు రెండు ప్రాజెక్టుల్లోనూ రెండు గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
కాగా.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని.. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొంగిపోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
