తెలంగాణలో గ్రేట్ ట్విస్ట్…

తెలంగాణలో గ్రేట్ ట్విస్ట్…

తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం టిక్కెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రోహిన్ రెడ్డి చూపిన చొరవకు ఎ.ఎం. రత్నం కృతజ్ఞతలు తెలిపారు.

నెలరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డు (Gaddar Film Awards) లను ఘనంగా జరపడంతో సినిమా వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. ఎలాంటి వివాదాలకు తెర తీయకుండా సమర్థవంతంగా దీన్ని ‘దిల్’ రాజు (Dil Raju) నేతృత్వంలో నిర్వహించడం మంచిదే అయ్యింది. అయితే… సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే విషయంలోనూ, రిలీజ్ కు ముందు పెయిడ్ స్పెషల్ ప్రీమియర్ షోస్ ను వేసుకునే విషయంలోనూ ఇంకా కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దీన్ని ‘హరిహర వీరమల్లు’ (Hair Hara Veeramallu) సినిమా విడుదల సందర్భంలో తొలగించడం విశేషం.

తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా ఉన్న ‘దిల్’ రాజు ప్రభుత్వ పెద్దల మనసెరిగి సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే విషయంలోను, ప్రీమియర్ షోస్ విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. ‘పుష్ప-2’ సినిమా ప్రీ-రిలీజ్ సందర్భంగా జరిగిన చేదు సంఘటనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే కాదు… తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కొంత పరుషపదజాలంతో సినిమా వాళ్ళను టార్గెట్ చేశారు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలూ అంటే కోమటిరెడ్డి ఓ విభజన రేఖ కూడా గీశారు. ఇక మీద టిక్కెట్ రెట్లు పెంచుకోవడం, ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోస్ వేయడం కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు. అలానే కోర్టులు సైతం ఓ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, ఆ తర్వాత దీనిపై సినిమా రంగమే ప్రభుత్వంతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది.

సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలకు టిక్కెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించానా… దిల్ రాజు తన తాజా చిత్రం ‘తమ్ముడు’ విషయంలో టిక్కెట్ రేట్ల పెంపు గురించి ప్రభుత్వాన్ని అడగమని, ఇప్పుడున్న రేట్లు సరిపోతాయని చెప్పారు. అలానే దానికి ముందు వచ్చిన నాని ‘హిట్ 3’ సినిమాకు ఏపీలో టిక్కెట్ రేట్లను పెంచుకునే సౌలభ్యం కల్పించారు. కానీ తెలంగాణలో మాత్రం దాని టిక్కెట్ రేట్లను పెంచలేదు. దాంతో ఇక మీద తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచుకునే ఆస్కారం ఉండదేమోననే చిన్నపాటి గుబులు నిర్మాతలలో కలిగింది.

ఇక ‘హరి హర వీరమల్లు’ విషయానికి వస్తే… ఏపీలో ఇప్పటికే పది రోజుల పాటు ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణలో సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. ఇలాంటి టైమ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ నేత రోహిన్ రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. ఎ. ఎం. రత్నం రిక్వెస్ట్ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కన్వెన్స్ చేసి ‘హరిహర వీరమల్లు’ టిక్కెట్ రేట్లు తెలంగాణలో సైతం పెంచుకొనేలా చేశారని అంటున్నారు. అంతేకాదు… ఇక్కడ కూడా పెయిడ్ ప్రీమియర్ షోస్ కు పర్మిషన్ ఇప్పించారట. ఈ విషయంలో రోహిన్ రెడ్డి సాయం మరివలేమంటూ ఎ. ఎం. రత్నం స్వయంగా సోమవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అయిన రోహిన్ రెడ్డి గతంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘తిక్క’ మూవీని ప్రొడ్యూస్ చేశారు. దానికి ఆయన సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. అలా సినిమా రంగంతో రోహిన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నియోజకవర్గం నుండి రోహిన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ ను సినిమా రంగానికి చెందిన వారు ఎవరు కలిసినా… వారితో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉంటూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రోహిన్ రెడ్డి అంబర్ పేట నుండి గెలిచి ఉంటే… ఇవాళ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా తెలంగాణలో సేవలు అందించేవారేమో! ఏదేమైనా… ‘హరిహర వీరమల్లు’ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. తమ చిత్రాలకూ పర్మిషన్లు అడగడానికి ఆస్కారం ఏర్పడినట్టు అయ్యింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version