ఘనంగా.. ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం
హన్వాడ /నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామంలో శివ సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా ప్రతిష్టించిన ధ్వజస్థంభం ప్రతిష్ట మహోత్సవానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే యజ్ఞశాలలో ముందుగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని ఎమ్మెల్యే కోరారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, టంకర కృష్ణయ్య, నాయకులు మండల బిసి సెల్ చైర్మన్ పాశం సత్యయ్య, కేశవులు , అక్కపల్లి నర్సింహులు, మోహన్, పార్పల్లి మోహన్, కృష్ణయ్య, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.