ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ కొనుగోలు కేంద్రంలో తనిఖీ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ధాన్యం రాశులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు హమాలీల సంఖ్య ను పెంచి వెంట వెంటనే ధాన్యం అన్ లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
తనిఖీలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
