రాష్ట్రస్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న కాపిల్ల నరేష్ ప్రాథమిక స్థాయిలో పిల్లలకు బోధించేందుకు తయారుచేసిన *బోధన అభ్యసన సామాగ్రి* రాష్ట్రస్థాయి నుండి సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎంపికైన ఏకైక టీచర్ నరేష్ ఈనెల 7,8,9 తేదీలలో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి లో జరిగిన *రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26* లో భాగంగా *టీచర్ ఎగ్జిబిట్* విభాగంలో తను తయారుచేసిన బోధనాభ్యాసన సామాగ్రిని ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వచ్చిన ప్రదర్శనల అన్నిటి నుండి టాప్ లో నిలిచి ఈనెల 19 నుండి 23 వరకు సౌత్ రాష్ట్రాలు పాల్గొనే సౌత్ ఇండియా స్థాయికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కాపిల్ల నరేష్ మాట్లాడుతూ *నేను పిల్లలకు బోధించే సమయంలో ఉపయోగించే సామాగ్రిని ప్లాస్టిక్ వినియోగం లేకుండా కేవలం అటముక్కలు, పేపర్ లాంటి వాటితో ఎలాంటి ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో పిల్లలు స్వయంగా ఉపయోగించుకుంటూ గణితం, తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా తయారు చేయడం వల్ల ఇది చాలామందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో రాష్ట్రస్థాయి న్యాయ నిర్నేతలు నా బోధన అభ్యసన సామాగ్రిని సౌత్ ఇండియా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.*
ఈ సందర్భంగా సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైన కాపీల నరేష్ ను మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అభినందించారు.
